Tuesday, October 22, 2024
HomeతెలంగాణKTR: కాంగ్రెస్ నాయకుల ఆదాయం పెరుగుతోంది: కేటీఆర్

KTR: కాంగ్రెస్ నాయకుల ఆదాయం పెరుగుతోంది: కేటీఆర్

KTR: కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ‘ఎక్స్’ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓవైపు రాష్ట్ర ఆదాయం తగ్గుతున్నా సరే.. కాంగ్రెస్ నాయకుల ఆదాయం పెరుగుతోందంటూ మండిపడ్డారు. “రాష్ట్ర ఆదాయం తగ్గుతోంది, కాంగ్రెస్ నాయకుల ఆదాయం అమాంతం పెరుగుతోంది !! పదేళ్లపాటు బుల్లెట్ వేగంతో.. పరుగులు పెట్టిన తెలంగాణకు అసమర్థ, అవినీతి పాలనే శాపం. తప్పులపై తప్పులు చేసి.. తీరా తగ్గిన ఆదాయంపై అధ్యయనం చేయాలని ఆదేశించడం..ఇందుకోసం ఏకంగా ఇతర రాష్ట్రాలకు బృందాలను పంపించడం.. మీ అజ్ఞానానికి మరో సజీవ సాక్ష్యం” అని విమర్శించారు.

- Advertisement -

“మీ అనాలోచిత విధానాలతో ఆర్థిక వృద్ధికి బ్రేకులు వేసి.. పాతాళానికి పడిపోయేలా చేసిన పాపం ముమ్మాటికీ మీదే.. పది నెలల పాలనలో అన్ని రంగాలను ఆగం చేసింది మీరే..మీ కూల్చివేతల మనస్తత్వంతో రియల్ ఎస్టేట్ కుదేలు. మీ నిష్క్రియాపరత్వంతో ప్రభుత్వ వ్యవస్థలన్నీ దిగాలు. మీ అవినీతి, అక్రమార్జనకు పెట్టుబడిదారులు బెంబేలు. అందిన కాడికి దోచుకో.. బావమరిది, తమ్ముళ్ల తోటలో దాచుకో.. అనే మీ దోపిడీ విధానాలతోనే ఆర్థిక వృద్ధికి బీటలు” అని ఆరోపించారు.

“రాష్ట్ర రాబడి కన్నా.. మీ సొంత రాబడికే పెద్దపీట వేసే మీ దగాకోరు పాలసీలు, కుంభకోణాలకు తెరదించకుండా.. అధ్వాన్నంగా మారిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై ….మీరు వెయ్యి అధ్యయనాలు చేసినా.. రాష్ట్రానికి నో యూజ్..!” అంటూ దుయ్యబట్టారు. కాగా కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పాలనపై కేటీఆర్ ఒంటికాలుపై లేస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయంపై విమర్శలు చేస్తూ దూకుడు పెంచారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ అన్న చందంగా పరిస్థితి తయారైంది. ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటున్నారు. బూతులు మాట్లాడుకుంటూ రాష్ట్రంలో రాజకీయ వేడి రగిల్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News