ప్రతిరోజూ రాత్రి 9.30 గంటలకు 12 బోగీలతో కూడిన ఒక రైలు.. పంజాబ్‌లోని బఠిండా స్టేషన్‌లో బయల్దేరుతుంది. అందులో దాదాపు అన్ని వయసులకు చెందిన పురుషులు, మహిళలు చాలామంది ఉంటారు. అందరి దగ్గర కొన్ని పేపర్లు, డాక్యుమెంట్లు ఉంటాయి. వాటి గురించి వాళ్లలో వాళ్లే గుసగుసలాడుకుంటూ ఉంటారు. అందులో ఉండే మొత్తం 300 మంది ప్రయాణికుల్లో దాదాపు సగం మంది గమ్యం.. రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్‌లో ఉండే ఆచార్య తులసి ప్రాంతీయ క్యాన్సర్ ఆస్పత్రి, పరిశోధన కేంద్రం!! ఉదయాన్నే 6 గంటలకు బికనేర్ వెళ్లే ఈ రైలు ఒకోసారి ఒకటి, లేదా రెండు గంటలు ఆలస్యం అవుతుంది. కానీ, అనేకమంది క్యాన్సర్ రోగుల ఆశలను మాత్రం అది మోసుకెళ్తుంది.
ఈ రైలుకు ఉన్న మరోపేరు… పంజాబ్ క్యాన్సర్ రైలు!! ఎందుకంటే, రోజూ కొన్ని వందల మంది క్యాన్సర్ రోగులను పంజాబ్, హరియాణా రాష్ట్రాల నుంచి చికిత్స కోసం ఇది రాజస్థాన్‌కు తీసుకెళ్తుంది. దాదాపు 325 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మరీ అక్కడి వరకు వెళ్లడానికి ఏకైక కారణం.. అక్కడ దాదాపు అందరికీ ఉచితంగానే చికిత్సలు లభించడం. పైపెచ్చు, క్యాన్సర్ రోగులకు రైలు టికెట్ ఉచితం. వారి సహాయకులకు సైతం మొత్తం ఛార్జీలో 75 శాతం వరకు రాయితీ లభిస్తుంది. బికనేర్‌లోని చాలా ఆస్పత్రులలో ముఖ్యమంత్రి పంజాబ్ క్యాన్సర్ రాహత్ కోశ్ పథకం అమలవుతుంది. దానికింద క్యాన్సర్ రోగులకు దాదాపు రూ. 15 లక్షల వరకు ఖర్చయ్యే చికిత్సలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుంది. కానీ, ఇదే పథకం కింద పంజాబ్‌లోని ఆస్పత్రులలో మాత్రం చికిత్సలు లభించడం చాలా కష్టం. అందుకే వాళ్లంతా అంత దూరం ప్రయాణించినా సరే… రాజస్థాన్‌కే వెళ్తారు.
ప్రపంచ క్యాన్సర్ రాజధాని
పంజాబ్‌తో పాటు.. పొరుగునే ఉన్న హరియాణాలో కూడా క్యాన్సర్ కేసులు అత్యధిక స్థాయిలో ఉండడం వల్లే భారతదేశానికి ప్రపంచ క్యాన్సర్ రాజధానిగా పేరొచ్చింది. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రజల ఆరోగ్యం బాగా పాడైపోవడానికి.. పర్యావరణం పూర్తిగా పాడైపోవడం, భూమి, నీరు, గాలి మొత్తం కలుషితభరితం కావడమే ప్రధాన కారణం. వీటివల్లే క్యాన్సర్ కేసులు కూడా బాగా పెరుగుతున్నాయి. 2022లో 14,61,427 కేసులు నమోదు కాగా, 2023లో 14,96,972 కేసులు నమోదయ్యాయని ప్రభుత్వ అధికారులు ఈ ఏడాది ప్రారంభంలో పార్లమెంటులో వెల్లడించిన తర్వాత దేశంలో క్యాన్సర్ కేసులు జీవనకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. 2017 నుంచి 2018 మధ్య రికార్డు స్థాయిలో 300% కేసులు పెరిగాయి. 2020లో భారతదేశంలో 14 లక్షల మందికి క్యాన్సర్ ఉందని తేలింది. ఈ సంఖ్య 2025 నాటికి 15.7 లక్షలకు పెరుగుతుంది. ఆహారం తీసుకోవడంలో మార్పులు, వ్యాధికి జన్యుసంసిద్ధత పెరగడం, క్యాన్సర్ వచ్చిన తొలినాళ్లలో చికిత్స పొందడంలో నిర్లక్ష్యం చూపడం లాంటివి ఈ పెరుగుదలకు కారణాలుగా కనిపిస్తున్నాయి.
పంజాబీ మహిళల్లో 30 సంవత్సరాల వయసు దాటినవారిలో గర్భాశయ ముఖద్వార, రొమ్ము క్యాన్సర్ కేసులు 2022లో నాలుగు రెట్లు పెరిగినట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లో ఆర్థికవృద్ధి నామమాత్రంగానే ఉంది. ఇక్కడి తలసరి రాష్ట్ర నికర ఉత్పత్తి 2022-23 ఆర్థిక సంవత్సరంలో హరియాణాలో రూ.3.25 లక్షలు, పంజాబ్‌లో రూ.1.95 లక్షలే ఉంది. ఈ ఆర్థిక కష్టాలకు తోడు క్యాన్సర్ కేసులు కూడా పెరిగిపోవడం వాళ్లకు మరింత భారంగా పరిణమిస్తోంది.
హరితవిప్లవం దుష్ప్రభావాల్లో ఇదీ ఒకటి..
మన దేశంలో ఆహారభద్రత సమస్య తీవ్రంగా ఉన్న 1960ల నాటి కాలంలో మొదలైన హరిత విప్లవం ఫలితాలను అత్యంత త్వరగా అందిపుచ్చుకుని, ఆ లాభాలు పొందిన రాష్ట్రాలలో హరియాణా, పంజాబ్ ముందు వరుసలో ఉన్నాయి. హరిత విప్లవం కారణంగా ప్రధానంగా పంట దిగుబడులు విపరీతంగా పెరిగాయి. అంతవరకు బాగానే ఉన్నా.. దాని వెనుక ఎరువులు, పురుగుమందులను విచ్చలవిడిగా వాడడం అనే ఒక అత్యంత ప్రమాదకర పరిణామం ఉందన్న విషయాన్ని చాలామంది గుర్తించలేదు. ఇప్పటికీ గుర్తించేందుకు ఇష్టపడడం లేదు. అయితే, పురుగుమందులు చల్లేటప్పుడు కేవలం ముక్కుకు ఒక వస్త్రాన్ని అడ్డుగా పెట్టుకోవడమో, చాలా సందర్భాల్లో అది కూడా లేకపోవడం వల్ల ఈ రెండు రాష్ట్రాల్లో రైతులు, వాళ్ల కుటుంబసభ్యులు ఎక్కువగా క్యాన్సర్ల బారిన పడుతున్నారు. కొన్ని రకాల రసాయనాల ప్రభావానికి గురికావడం వల్ల క్యాన్సర్ కణితులను నియంత్రించే జన్యువులు పనిచేయడం ఆగిపోతుంది. దాంతో వెంటనే క్యాన్సర్ మొదలవుతుంది. ఎక్కువకాలం పాటు పురుగుమందుల ప్రభావానికి గురైతే వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుంది. పంజాబ్ ఒక్క రాష్ట్రంలోనే ఏడాదికి ఏకంగా 5,270 టన్నుల పురుగుమందులు వినియోగిస్తారు. దేశంలో ఇలాంటి రసాయనాల తలసరి వాడకం అత్యధికంగా ఉన్న రాష్ట్రం కూడా ఇదే. పెద్దమొత్తంలో ఈ పురుగుమందులను వాడడం వల్ల భూగర్భ జలాల్లోనూ అవి చేరిపోతాయి. తాగునీరు, ఆహారంలోనూ ఈ విషపదార్థాలు పేరుకుపోయి.. చివరకు మనుషుల శరీరాల్లోకి కూడా ప్రవేశిస్తాయి. ఇది ఎంత దారుణంగా ఉందంటే.. హరియాణాలో కొందరు మహిళలు ఇచ్చే తల్లిపాలల్లోనూ పురుగుమందుల అవశేషాలు కనిపించాయి!!
పంజాబ్‌లోని లూధియానాలో ఆవుపాల నమూనాల్లో 6.9 శాతం వాటిలో హెక్సాక్లోరోపైక్లోహెక్సేన్, డైక్లోరో-డైఫీనైల్ ట్రైక్లోరోఈథేన్ (డీడీటీ), ఎండోసల్ఫాన్, సైపర్‌మెత్రిన్, సైహాలోత్రిన్, పెర్మెత్రిన్, క్లోర్‌పైరిఫాస్, ఎతియాన్, ప్రొపెనోఫాస్ లాంటివన్నీ ఆమోదనీయ స్థాయిల కంటే ఎక్కువగా ఉన్నట్లు తాజా పరిశోధనల్లో తేలింది. ఈ పాలను తాగేవారికి క్యాన్సర్ సోకే ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. పంజాబ్‌లోని మాల్వా ప్రాంతంలోని భూగర్భ జలాల్లో అయితే ఆర్సెనిక్, సీసం, యురేనియం లాంటి లోహ కాలుష్యాలూ ఉన్నాయి.
దిగుబడులు సరే.. రోగభారం ఎంత?
పంట దిగుబడులు పెంచాలని ఎరువులు, పురుగుమందులు వాడుతుంటే.. రోగాలంటూ భయపెడతారేంటని చాలామంది అడుగుతారు. కానీ, క్యాన్సర్ చికిత్స అనేది తీవ్రమైన ఆర్థికభారంతో కూడుకున్నది. క్యాన్సర్ శస్త్రచికిత్సలకు కనీసం రూ. లక్ష నుంచి రూ.6 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇక రేడియేషన్, కీమోథెరపీ, హార్మోన్ చికిత్సలు, ఇమ్యునోథెరపీ.. ఇలాంటివాటికి ఇంకా బాగానే అవుతుంది. వీటన్నింటినీ భరించే పరిస్థితి కాస్త ఎగువ మధ్యతరగతి వాళ్లకు కూడా ఉండదు. 2017-18లో పంజాబ్‌లో తలసరి ఆరోగ్య ఖర్చు రూ.1,086. ఇది జాతీయ సగటు కంటే చాలా తక్కువ. ఇలాంటి పరిస్థితులన్నింటినీ ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకుని ప్రకృతి సాగును ప్రోత్సహించడం, పురుగుల నివారణకు ఇతర సస్యరక్షణ చర్యలు చేపట్టేలా రైతులకు అవగాహన కల్పించడం లాంటి చర్యలు చేపట్టాల్సి ఉంది. లేకపోతే కేవలం పంజాబ్, హరియాణా మాత్రమే కాదు.. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులే తలెత్తుతాయి.
తెలుగుప్రభ ప్రత్యేక ప్రతినిధి