Tuesday, October 22, 2024
Homeఆంధ్రప్రదేశ్CID: రాష్ట్రవ్యాప్తంగా మద్యం డిస్టలరీల్లో సీఐడీ అధికారుల తనిఖీలు

CID: రాష్ట్రవ్యాప్తంగా మద్యం డిస్టలరీల్లో సీఐడీ అధికారుల తనిఖీలు

CID| రాష్ట్రవ్యాప్తంగా మద్యం డిస్టలరీల్లో సీఐడీ బృందాల తనిఖీలు కొనసాగుతున్నాయి. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం నాసిరకం మద్యం అమ్మారనే ఆరోపణలతో కూటమి ప్రభుత్వం మద్యం డిస్టిలరీలపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలోనే మద్యం అవకతవకలపై సీఐడీ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు వివిధ డిస్టలరీల్లో మద్యం తయారీపై ఆరా తీస్తున్నారు. 2014-2019 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన డిస్టలరీలను పలువురు వైసీపీ నేతలు చేజిక్కించున్నారనే ఫిర్యాదులపై విచారణ చేస్తున్నారు. అంతేకాకుండా డిస్టలరీల నుంచి బెవరేజ్ కార్పొరేషన్‌కు మాత్రమే కాకుండా అనధికార సరఫరాపై సీఐడీ ఫోకస్ పెట్టింది. రికార్డుల పరిశీలన, ఆధారాల సేకరణపై అధికారులు దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఈ క్రమంలోనే అనకాపల్లి జిల్లా కశింకోట మండలంలోని విశాఖ, జీఎస్పీ డిస్టిలరీస్‌లో తనిఖీలు చేపట్టారు. అలాగే చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ డీకే పల్లి సమీపంలోని వ్యాంటేజీ డిస్టలరీలో.. కడప నగర సమీపంలోని ఈగల్ డిస్టలరీస్‌లో సోదాలు నిర్వహించారు. ఇందులో 9సీ హార్స్ చీప్ లిక్కర్ తయారీ కంపెనీపై ఆరా తీస్తున్నారు. ఈ మద్యాన్ని గత ఐదు సంవత్సరాలలో ఎంత తయారు చేశారు.. ఎంత మేరకు ప్రభుత్వానికి సరఫరా చేశారనే దానిపై కూపీ లాగుతున్నారు.

ఇక తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం కోటపాడు శివారు పీఎంకే డిస్టిలేషన్స్ ప్రయివేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో కూడా అధికారులు తనిఖీలు చేశారు. ఇవే కాకుండా తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి సమీపంలోని ఎస్వీఆర్‌ డిస్టిలరీస్‌పై.. ప్రకాశం జిల్లా సింగారయకొండ మండలం పాత సింగరాయకొండ పరిధిలోని పెరల్‌ డిస్టిలరీల్లో దాడులు నిర్వహించారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి సెంటనీ బయోటెక్ కర్మాగారంలో మద్యం బాటిలింగ్ యూనిట్‌లోనూ.. నంద్యాలలోని ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్‌ను అధికారులు పరిశీలించారు. అయితే ఇందులో కొన్ని డిస్టలరీల వెనకు వైసీపీకి చెందిన కీలక నేతల హస్తం ఉందని సమాచారం. అందుచేత దీనిపై పక్కాగా ఆధారాలు సేకరించి వారిపై చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News