BSNL| కేంద్ర టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్(BSNL) కీలక ప్రకటన చేసింది. ఇప్పట్లో టారిఫ్‌లు పెంచే ఆలోచనే లేదని స్పష్టం చేసింది. సమీప భవిష్యత్తులో టారిఫ్‌లను పెంచడం లేదని బీఎస్‌ఎన్‌ఎల్ ఛైర్మన్, ఎండీ రాబర్ట్ రవి పేర్కొన్నారు. తమ కస్టమర్ల సంతోషం, విశ్వాసాన్ని గెలుచుకోవడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. కాగా ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు ఇటీవల కాలంలో టారిఫ్‌లను భారీగా పెంచిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలు కస్టమర్లు BSNLకు పోర్ట్ అవుతున్నారు. అయితే 4జీ నెట్ వర్క్ సరిగ్గా రావడంల లేదంటూ అసహనం వ్యక్తంచేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ టవర్లు శరవేగంగా ఏర్పాటుచేస్తున్నారు. ఇదే సమయంలో వేగవంతమైన 5జీ సేవలను అందించేందుకు సిద్ధమవుతున్న బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా కంపెనీ లోగోను కూడా మార్చింది. గతంలో వృత్తాకారంలోని ఊదా రంగు లోగోపై నీలం, ఎరుపు వర్ణంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ చిహ్నాలు ఉండేవి. ప్రస్తుతం వాటి స్థానంలో కాషాయ రంగు వృత్తాకారం మధ్యలో భారత చిత్రపటాన్ని ఉంచి దానిపై తెలుపు, ఆకుపచ్చ వర్ణంలో కనెక్టివిటీ సింబల్స్‌ను ఉంచారు.
అలాగే స్పామ్ బ్లాకర్స్, సిమ్ కియోస్క్‌లు, వైఫై రోమింగ్, ఐపీ టీవీ, ఏనీ టైమ్ సిమ్ కియోస్క్‌లు, డైరెక్ట్ టు డివైజ్ సర్వీస్, పబ్లిక్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ రిలీఫ్, గనుల్లో ప్రైవేట్ 5జీ వంటి ఏడు కొత్త సర్వీసులను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విడుదల చేశారు. మరోవైపు చౌక రీఛార్జ్ ప్లాన్ టారిఫ్‌లను కంపెనీ అందిస్తోంది. తాజాగా 997 రూపాయలు ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో 160 రోజుల పాటు మొత్తం 320GB డేటాను పొందుతారు. అంటే రోజుకు 2GB డేటాను ఉపయోగించుకోవచ్చు. అలాగే అన్‌లిమిటెడ్ కాల్స్, ఉచిత మెసేజ్‌లు, హార్డీ గేమ్స్+ఛాలెంజర్ అరేనా గేమ్స్+ గేమ్‌వన్, ఆస్ట్రోటెల్+గేమ్+జింగ్ మ్యూజిక్+వేవ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లకు ఉచిత సభ్యత్వాన్ని కూడా పొందవచ్చు.