Bigg Boss 8 Telugu| బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఆడుతున్న గంగవ్వ(Gangavva)కు గుండెపోటు వచ్చిందనే వార్తలు ఉదయం నుంచి హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో బిగ్ బాస్ అభిమానులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఈ వార్తలపై మైవిలేజ్ షో నిర్వాహకులు తెలిపారు. ఈ షో టీంసభ్యుడైన అంజిమామ ఈ వార్తలను కొట్టిపారేశారు. ఈ వార్త తెలియగానే తాము బిగ్ బాస్ నిర్వాహకులకు ఫోన్ చేశామని.. అయితే వారు అలాంటిదేమీ లేదని చెప్పినట్లు తెలిపారు. కాగా గతంలోనూ గంగవ్వకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని చెప్పకొచ్చారు. దీంతో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లైంది.
ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 4లో గంగవ్వ పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సీజన్‌లో తనకు ఆరోగ్యం సహకరించడం లేదని.. హౌస్ వాతావరణానికి అలవాటు పడలేకపోతున్నానని చెప్పి గంగవ్వ తనంతట తానే ఎలిమినేట్ అయ్యారు. అయితే తాజా సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో గంగవ్వ మరోసారి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి మాత్రం తొలి రోజు నుంచి తగ్గదేలే అన్నట్టుగా యంగ్ కంటెస్టెంట్లతో పోటీపడి టాస్కులు ఆడుతూ.. స్పెషల్ పవర్స్ కూడా సంపాదించుకున్నారు. యంగ్ కంటెస్టెంట్లకు కూడా చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే హౌస్‌లో ఉన్న వారిని ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్(ఓజీ)గా, వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చినవారిని రాయల్ క్లాన్‌గా విడిపోయి గేమ్ అడుతున్నారు.
కాగా సోషల్ మీడియా అంటే తెలియని గంగవ్వ మై విలేజ్ షో ద్వారా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారారు. ఇదే ఫేమ్‌తో బిగ్ బాస్ సీజన్ 4లోనూ ఎంట్రీ ఇచ్చారు. వయసుతో సంబంధం లేకుండా చాలా యాక్టివ్‌గా ఉంటూ తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ ఉంటారు. అచ్చమైన తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఎంతో మంది మనసులు గెలుచుకున్నారు. ఈ క్రమంలోనే అడపాదడపా సినిమాల్లో కూడా కనిపిస్తూ అభిమానులను అలరిస్తున్నారు.