Bandi Sanjay| తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఓవైపు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. మరోవైపు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవల కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలకు సంజయ్ కూడా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సంజయ్ పేపర్ లీక్ చేశారని కేటీఆర్ ఆరోపిస్తే.. కేటీఆర్ డ్రగ్స్ తీసుంటారని సంజయ్ ఆరోపించారు. ఇలా ఇద్దరి నేతల మధ్య వాడివేడి విమర్శలు, ఆరోపణలు కొనసాగాయి.
ఈ క్రమంలోనే బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తన వ్యక్తిగత పరువుకు భంగం కలిగేలా సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే కేటీఆర్ నోటీసులపై సంజయ్ ధీటుగా స్పందించారు. లీగల్ నోటీసులతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారెవరూ లేరని సంజయ్ తెలిపారు. ఇకపై మాటకు మాట.. నోటీసులకు నోటీసులు.. కాచుకో కేటీఆర్ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
‘‘నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక లీగల్ నోటీసులు ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోంది. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. నాపై తొలుత వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించింది కేటీఆరే. అందుకు బదులుగానే నేను మాట్లాడాను. ఆయన బాగోతం ప్రజలకు తెలుసు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో తెలుసు. ఇప్పటి వరకు మాటకు మాటతోనే బదులిచ్చాను. లీగల్ నోటీసులకు నోటీసులతోనే బదులిస్తా. మేం చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే వ్యక్తులం. చట్టం, న్యాయం ప్రకారం ముందుకు వెళ్తాం’’ అని సంజయ్ పేర్కొన్నారు.
అయితే సంజయ్ వ్యాఖ్యలపైనా కేటీఆర్ తాజాగా స్పందించారు. సంజయ్ నోటీసులు తాను కూడా మళ్లీ నోటీసులు పంస్తానని స్పష్టంచేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ ఎలా అయితే నోటీసులు పంపించారో.. తాను కూడా అలాగే పంపిస్తానన్నారు. మొత్తానికి కేటీఆర్, బండి సంజయ్ మధ్య పొలిటికల్ వార్ తారాస్థాయికి చేరుకుంది.