Wednesday, October 23, 2024
Homeఇంటర్నేషనల్Modi- BRICS Summit: యుద్ధానికి కాదు.. దౌత్యానికే భారత్ మద్దతు: ప్రధాని మోదీ

Modi- BRICS Summit: యుద్ధానికి కాదు.. దౌత్యానికే భారత్ మద్దతు: ప్రధాని మోదీ

Modi- BRICS Summit | రష్యా వేదికగా జరుగుతోన్న బ్రిక్స్ సదస్సు(BRICS Summit)లో భారత ప్రధాని మోదీ (PM Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. దౌత్యం, చర్చలకు మాత్రమే భారత్ మద్దతు ఇస్తుందని.. యుద్ధానికి కాదని మరోసారి స్పష్టంచేశారు. ప్రపంచాన్ని సరైన మార్గంలో తీసుకెళ్లేందుకు బ్రిక్స్ సానుకూల పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, ఇజ్రాయెల్-ఇరాన్, ఇజ్రాయెల్-హమాస్, హిజ్బుల్లా సంస్థల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

- Advertisement -

ఈ సదస్సులో మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. “బ్రిక్స్‌ భాగస్వాములుగా ఇతర దేశాలను ఆహ్వానించేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. ఈ విషయంలో వ్యవస్థాపక సభ్య దేశాల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలి. మేం చర్చలు, దౌత్యానికి మద్దతిస్తాం కానీ యుద్ధానికి కాదు. కరోనా వంటి భీకర సవాల్‌ను కలిసికట్టుగా ఎదుర్కొన్నట్టు భావి తరాలకు సంపన్న భవిష్యత్‌ను అందించే సామర్థ్యాలు మనకు ఉన్నాయి. అలాగే సైబర్ సెక్యూరిటీ, సురక్షిత ఏఐ కోసం అంతర్జాతీయ స్థాయిలో పటిష్ట నిబంధనల కోసం పని చేయాలి” అని పిలుపునిచ్చారు.

“ఉగ్రవాదం, ఉగ్రవాదానికి అందే ఆర్థిక సహకారంపై బ్రిక్స్ దేశాలు కఠినంగా వ్యవహరించాలి. ఉగ్రవాదం వంటి తీవ్ర సమస్యలపై ద్వంద్వ వైఖరి సరికాదు. మన దేశాల్లో యువత ఉగ్రవాద బాటపట్టకుండా చర్లయు తీసుకోవాలి, ఐక్యరాజ్యసమితిలో పెండింగ్‌లో ఉన్న ఉగ్రవాద అంశంపై పని చేయాలి. బ్రిక్స్ ప్రజా ప్రయోజనాలకు పాటుపడే కూటమి అని ప్రపంచానికి సందేశాన్ని ఇవ్వాల్సి ఉంది” అని మోదీ పేర్కొన్నారు.

కాగా బ్రిక్స్‌ కూటమి 16వ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా సభ్య దేశాల నాయకులు దిగిన గ్రూప్‌ ఫొటోను భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. తొలుత బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాతో బ్రిక్స్‌ కూటమి ఏర్పాటైంది. ఇప్పుడు ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈలకూ సభ్యత్వం ఇచ్చారు. కూటమి విస్తరణ తర్వాత ఇదే తొలి శిఖరాగ్ర సదస్సు కావడం విశేషం. ఈ సదస్సులో భాగంగా భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పక్కపక్కనే ఉండి నవ్వుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రపంచంలోనే మోస్ట్ పవర్‌ఫుల్ లీడర్స్ ఒకే ఫ్రేమ్‌లో ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News