IND vs NZ| భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి రెండో టెస్ట్ ప్రారంభమైంది. పుణె వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ మ్యాచులో భారత్ మూడు మార్పులతో.. ఆతిథ్య కివీస్ జట్టు ఓ మార్పుతో బరిలో దిగాయి. అయితే అందరూ అనుకున్నట్లే కేఎల్ రాహుల్‌ను జట్టు నుంచి తప్పించారు. రాహుల్ స్థానంలో శుభమన్ గిల్ జట్టులోకి వచ్చాడు. ఇక కుల్దీప్ యాదవ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్ స్థానంలో ఆకాశ్ దీప్ ఆడుతున్నారు.
టాస్ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ జట్టులో మూడు మార్పులు చేశామని తెలిపారు. పేసర్ మహ్మద్ సిరాజ్, మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లను పక్కన పెట్టి పేసర్ ఆకాశ్ దీప్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్, యువ బ్యాటర్ శుభమన్ గిల్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. తొలి టెస్టు ఓడిపోయిన భారత్ ఈ మ్యాచులో గెలిచి సిరీస్ సమం చేయాలని పట్టుదలతో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ ప్రస్తుతం ఓ వికెట్ కోల్పోయి 36 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ ఓ వికెట్ తీశాడు.
తుది జట్లు ఇవే..
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా.
న్యూజిలాండ్: టామ్ లాథమ్ (కెప్టెన్), డెవోన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సౌథీ, మిచెల్ సాంట్నర్, అజాజ్ పటేల్, విలియం ఒరోర్కే