Amaravati Railway line| కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో శుభవార్త తెలిపింది. రాజధాని అమరావతి(Amaravati) మీదుగా కొత్త రైల్వే లైన్‌కు కేంద్ర మంత్రివర్గం(Union Cabinet) ఆమోదం తెలిపినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnav) ప్రకటించారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా గుంటూరు జిల్లాలోని నంబూరు వరకు 57 కిలోమీటర్ల మేర ఈ రైల్వే లైన్ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం రూ.2,245 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆయన వివరించారు. నాలుగేళ్లలో ఈ రైల్వే నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టంచేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నది(Krishna River)పై 3.2 కి.మీ పొడవైన వంతెన నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పుకొచ్చారు.
ఈ రైల్వే నిర్మాణం పూర్తి అయితే అమరావతికి ఇటు హైదరాబాద్, అటు కోల్‌కత్తా, చెన్నై నగరాలతో కనెక్టివిటీ పెరుగుతుంది. దీంతో అభివృద్ధి పరుగులు పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు మధ్య ప్రాంతాలలో రైలు మార్గానికి అవసరమైన భూమిని సేకరించాలని రైల్వే శాఖ కార్యాచరణ మొదలు పెట్టింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలోని 97 గ్రామాలలో భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో భూసేకరంలో వేగం పుంజుకోనుంది. ఈ రైల్వే లైన్‌తో అమరావతికి చెన్నై, కొలకత్తా, హైదరాబాద్, ఢిల్లీ నగరాలతో అనుసంధానం చేయనున్నారు. గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఖమ్మం జిల్లాల మీదుగా కొత్త రైలు మార్గాన్ని నిర్మించేందుకు దాదాపు 450 హెక్టార్ల భూమిని వినియోగించుకోనున్నారు.
ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేకరించటం కోసం దాదాపు రూ.2000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని రైల్వే శాఖ అంచనా వేసింది. ఈ కొత్త రైల్వే లైన్ లో మొత్తం తొమ్మిది స్టేషన్లు ఉండనున్నాయి. పెద్దాపురం, చిన్నరావులపాలెం, గొట్టిముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావురు స్టేషన్లు ఉంటాయి. వీటిలో అమరావతిని ప్రధాన స్టేషన్‌గా అభివృద్ధి చేయటానికి నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఈ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం పచ్చ జెండా ఊపడంతో పనులు చకచకా జరగనున్నాయి. మొత్తానికి కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కూటమి ప్రభుత్వం పాత్ర కీలకం కావడంతో రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులను సీఎం చంద్రబాబు తీసుకొస్తున్నారు. దీంతో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టనుంది.