Saturday, October 26, 2024
HomeఆటIND vs NZ: రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ ఆలౌట్.. భారత్ ముందు భారీ టార్గెట్

IND vs NZ: రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ ఆలౌట్.. భారత్ ముందు భారీ టార్గెట్

IND vs NZ| పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియాకు 359 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించింది. కెప్టెన్ టామ్ లాథమ్(86), గ్లెన్ ఫిలిప్స్‌ (48*), టామ్ బ్లండెల్ (41) రాణించారు. కివీస్ టీమ్ 10 వికెట్లను స్పిన్నర్లే తీయడం విశేషం. ఇక భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4, రవీంద్ర జడేజా 3, రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లు తీశారు.

- Advertisement -

భారీ లక్ష్యంతో బరిలో దిగిన భారత్.. ధాటి ఆడుతోంది. అయితే మరోసారి కెప్టెన్ రోహిత్ శర్వమ(8) నిరాశపరిచాడు. దీంతో లంచ్‌ బ్రేక్‌ సమయానికి భారత్‌ 81/1 పరుగులు చేసింది. టీమ్‌ఇండియా విజయానికి మరో 278 పరుగులు కావాల్సి ఉంది. యశస్వి జైశ్వాల్‌(46*), గిల్‌(22*) క్రీజులో ఉన్నారు. ఇక రెండున్నర రోజుల ఆట మిగిలి ఉండటం.. స్పిన్‌కు అనుకూలంగా మారిన పిచ్‌పై ఇంతటి భారీ లక్ష్యాన్ని రోహిత్ సేన ఛేదించడం చాలా కష్టమని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 259 పరుగులతో గౌరవప్రదమైన స్కోర్ చేసింది. కివీస్ బ్యాటర్లలో ఓపెనర్ డేవన్ కాన్వే (76) పరుగులు, తొలి టెస్టు సెంచరీ హీరో రచిన్ రవీంద్ర(65) పరుగులతో రాణించారు. అయితే మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఓ దశలో 197/4 పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్న కివీస్ జట్టును స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ముప్పతిప్పలు పెట్టాడు. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన సుందర్ అదరగొట్టాడు. తన స్పిన్ మాయాజాలంతో ఏడు వికెట్లు తీశాడు. ఇక మరో సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లతో రాణించాడు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టును కివీస్ బౌలర్లు బెంబేలెత్తించారు. వరుసగా వికెట్లు తీస్తూ హడలెత్తించారు. ఈ దెబ్బకు భారత్ కేవలం 156 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో ఆతిథ్య జట్టుకు 103 పరుగుల ఆధిక్యం లభించింది. కివీస్ బౌలర్లలో స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ ఒక్కడే 7 వికెట్లు తీశాడు. మరి రెండో ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటి భారత్‌పై విజయం సాధించి సిరీస్ అందుకుంటారో లేదో చూడాలి. మరోవైపు తొలి టెస్టు ఓడిపోయిన భారత్ ఈ మ్యాచులో గెలిచి సిరీస్ సమం చేయాలని పట్టుదలతో ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News