Tirupati| ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిని హోటళ్లకు బాంబు బెదిరింపులు ఆగడంలేదు. గత రెండు రోజులుగా నగరంలోని పలు హోటళ్లలో బాంబులు పెట్టినట్లు బెదిరింపుల మెసేజ్‌లు, ఈమెయిల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. వరుసగా మూడో రోజు కూడా ఉగ్రవాద సంస్థల నుంచి బెదిరింపుల మెయిల్స్ వచ్చాయి. తాజాగా జాఫర్ సాదిక్ పేరుతో మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో బెదిరింపులు వచ్చిన హోటళ్లలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. తిరుపతి కేటీ రోడ్డులోని ఆలయానికి కూడా బెదిరింపు మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది.
కాగా రెండు రోజుల క్రితం కూడా తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్‌పార్క్, పాయ్‌వైస్రాయ్ హోటల్‌తో పాటు మరో రెండు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు మెయిల్ వచ్చింది. ఐఎస్‌ఐ ఉగ్రవాదుల పేరుతో ఈ బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో విస్తృత్తంగా తనిఖీలు చేపట్టారు. అయితే డీఎస్పీ వెంకట నారాయణ పర్యవేక్షణలో సిబ్బంది ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. అలాగే లీలామహల్ సమీపంలోని మూడు ప్రైవేటు హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్‌కు మెయిల్‌లో బెదిరింపులు వచ్చాయి.
తిరుపతిలో వరుసగా బాంబు బెదిరింపులు రావడంతో స్థానిక ప్రజలతో పాటు భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కడా పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఎయిర్ పోర్టులు, విమానాలు, రైల్వేస్టేషన్లకు ఇటీవల బాంబు బెదిరింపు కాల్స్ పెరిగిపోయాయి. దీంతో అటు విమానయాన సంస్థలు, ఇటు ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. దీంతో బాంబు బెదిరింపులకు పాల్పడిన ఆకతాయిల ఆటకట్టించేందుకు కేంద్ర విమానయాన శాఖ కఠిన నిబంధనలు తెచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకోసం విస్తృత తనిఖీలతో పాటు బెదింపు మెయిల్స్, కాల్స్ చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించేందుకు రెడీ అవుతోంది.