BRS Leaders Arrest| జన్వాడ ఫామ్‌హౌస్(Janwada Farmhouse)లో మద్యం పార్టీకి ఆతిథ్యం ఇచ్చారన్న కారణంతో రాయదుర్గంలోని మాజీ మంత్రి కేటీఆర్(KTR) బామ్మర్ది రాజ్‌పాకాల ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఓరియన్ విల్లాలో రాజ్ పాకాల ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ తనిఖీలు నిర్వహించేందుకు వెళ్లారు. అయితే ఆ విల్లాకు తాళం వేసి ఉండటంతో సిబ్బంది కాసేపు ఆగారు. ఈలోపు సమీపంలోని మరో విల్లాలో ఆయన ఉన్నారని సమాచారంతో పోలీసులంతా అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలోనే అక్కడికి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా ఎక్సైజ్ పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విల్లాలోకి వెళ్తోన్న ఎక్సైజ్ అధికారులను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సెర్చ్‌వారెంట్ లేకుండా ఎలా తనిఖీలు చేస్తారని పోలీసులు బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో ఎమ్మెల్యే వివేకానంద రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సహా పలువురు నేతలను అరెస్టు చేశారు. అనంతరం ఎక్సైజ్ అధికారులు విల్లాలో సోదాలు నిర్వహించారు.
ఇదిలా ఉంటే ఈ రేవ్ పార్టీ(Rave Party)పై రాజేంద్రనగర్ డీసీపీ ప్రెస్ నోట్ విడుదల చేశారు. జన్వాడలోని రాజ్ పాకాలకు చెందిన ఫాంహౌస్‌పై శనివారం అర్ధరాత్రి సమయంలో లోకల్ పోలీసులు, ఎస్‌వోటీ, ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో దాడి జరిగిందని తెలిపారు. ఆ సమయంలో అక్కడ 21 మంది పురుషులు, 14 మంది స్త్రీలు ఉన్నారని పేర్కొన్నారు. ఈ దాడిలో 7 విదేశీ మద్యం బాటిళ్ళు, 10 లోకల్ మద్యం బాటిళ్ళు, ఇతర గేమింగ్ ఐటమ్స్ గుర్తించినట్లు వివరించారు.
ఈ సందర్భంగా పార్టీలో పాల్గొన్న పురుషులకు డ్రగ్స్ టెస్ట్ చేయగా.. విజయ్ మద్దూరి అనే వ్యక్తి కొకైన్ తీసుకున్నట్టు తేలిందన్నారు. రాజ్ ప్రోద్భలంతోనే డ్రగ్స్ తీసుకున్నట్లు అతడు చెప్పినట్లు తెలిపారు. అతడిని రక్త పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారని అన్నారు. అలాగే రాజ్ పాకాలపై ఎన్టీపీసీ యాక్ట్ 25, 27, 29 తో పాటు తెలంగాణ గేమింగ్ యాక్ట్ 3, 4 సెక్షన్ల కింద మొకిల పోలీస్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతులు తీసుకోకుండా పార్టీ నిర్వహించినందుకు ఎక్సైజ్ యాక్ట్ 34ఏ, 34(1) సెక్షన్ల కింద ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేశారని డీసీపీ వెల్లడించారు.