Thalapathy Vijay| కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ (Thalapathy Vijay) ఇటీవల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కళగం(Tamizhaga Vetri Kazhagam) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన ఆయన.. ఇవాళ పార్టీ తొలి రాష్ట్ర సదస్సు ఏర్పాటుచేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, పెరియార్, EV రామసామి, K. కామరాజ్, వేలు నాచియార్, అంజలై అమ్మాళ్‌తో పాటు చేర, చోళ, పాండ్య రాజవంశాల పురాణ రాజుల కటౌట్స్ మధ్య సభా ప్రాంగణాన్ని అలంకరించడం విశేషం. తమిళనాడులోని విల్లుపురంలో జరిగిన ఈ సభకు దాదాపు 8 లక్షల మంది ప్రజలు తరలివచ్చారు. దీంతో సభా ప్రాంగణమంతా జనాలతో కిక్కిరిసిపోయింది. ఇసుక వేస్తే రాలనంత జనాభా రావడంతో అభిమానులను కంట్రోల్ చేయడం పోలీసులకు కష్టమైంది.
ఈ క్రమంలోనే సభలో విజయ్ ఎంట్రీ అదిరిపోయింది. పొడవుగా ఏర్పాటుచేసిన ర్యాంపు మీద నడుచుకుంటూ అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా అభిమానుల ర్యాంప్ మీదకు విసిరేస్తున్న జెండాలను పట్టుకుని మెడలో వేసుకున్నారు. ఎటు చూసినా జనమే ఉండటంతో విజయ్ కూడా అభిమానులను పలకరిస్తూ ఎంతో ఉత్సాహంగా కనపడ్డారు. అనంతరం పార్టీ జెండాను ఎగరేశారు. ఈ సభలో పార్టీ విధివిధానాలను ఖరారుచేయనున్నారు విజయ్. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీ విధివిధానాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ద్రవిడ భావజాలానికి తగ్గట్లే తమ రాజకీయ కార్యకలాపాలు ఉంటాయని విజయ్ ఇటీవల వెల్లడించిన విషయం విధితమే.
ఇదిలా ఉంటే ఈ సభకు వెళ్తున్న ఇద్దరు కార్యకర్తలు రోడ్డు ప్రమాదంలో మరణించడం తీవ్ర విషాదం నిపింది. మృతులు తిరుచ్చికి చెందిన కలై మరియు శ్రీనివాసన్‌లుగా గుర్తించారు. వీరు ప్రయాణిస్తున్న కారు షేక్ హుస్సేన్‌పేట సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
ఇక విజయ్ సినిమాల విషయానికొస్తే ఇటీవల వెంకట ప్రభు దర్శకత్వం వహించిన ‘గోట్’ సినిమాతో అభిమానులను అలరించారు. ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినా కానీ కలెక్షన్ల పరంగా దుమ్మురేపింది. రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో చివరి సినిమా షూటింగ్‌ను ఇటీవలే మొదలుపెట్టారు. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళ రాజకీయల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం.