CV Anand| హైదరాబాద్‌లో నెల రోజుల పాటు 144 సెక్షన్(144 Section) అమలు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్(CV Anand) ప్రకటించారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా కొన్ని అసాంఘీక శక్తులు, పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయనే సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నెల రోజుల పాటు సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 28 వరకు ఆంక్షలు అందుబాటులో ఉంటాయని ఆనంద్ తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ పరిధిలో నెల రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. ఈ నెల రోజుల్లో పోలీసుల ఆదేశాలు పాటించకుండా, అనుమతి లేకుండా సమావేశాలు, ధర్నాలు, నిరసనలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు.
ఒకే రాష్ట్రం-ఒకే పోలీసింగ్ విధానం అమలు చేయాలంటూ స్పెషల్ పోలీసు కానిస్టేబుళ్లు, వారి కుటుంబసభ్యులు నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆందోళనలు ఉధృతం అవ్వడంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా 39 మంది కానిస్టేబుళ్లను పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది. ఇందులో 10 మంది కానిస్టేబుళ్లను సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తెలంగాణ స్పెషల్ పోలీసులు ఆందోళనలు ఉద్ధృతం చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
అంతేకాకుండా కేటీఆర్(KTR) బామ్మర్ది రాజ్ పాకాలకు చెందిన జన్వాడ ఫాంహౌస్‌లో భారీగా విదేశీ మద్యం, గేమింగ్ ఐటమ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు నేతలపై కేసులు నమోదుచేశారు. దీనిపై ప్రభుత్వం తీరును బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అది రేవ్ పార్టీ కాదని.. కుటుంబ సభ్యులతో చేసుకుంటున్న దావత్ అని కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ నేతలు స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలకు పిలుపునిచ్చే ప్రమాదం ఉండటంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌లో నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.