Monday, October 28, 2024
Homeఓపన్ పేజ్Samayam column-Telugu states full of sensational cases: కేసులు.. అరెస్టులు.. ఆస్తులు.. గొడవలు

Samayam column-Telugu states full of sensational cases: కేసులు.. అరెస్టులు.. ఆస్తులు.. గొడవలు

హాట్ పాలిటిక్స్..

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పు­డంతా కేసులు, అరె­స్టులు, ఆస్తుల గొడ­వలు, కోర్టు వివా­దాలే కని­పి­స్తు­న్నాయి. బీఆ­ర్‌­ఎస్ ప్రభు­త్వంలో చాలా­మంది మంత్రులు అరెస్టు అవు­తా­రని ప్రస్తుత తెలం­గాణ రెవెన్యూ మంత్రి పొంగు­లేటి శ్రీని­వా­స­రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాంబులా పేలాయి. దాని­మీద కేటీ­ఆర్‌ కూడా స్పందిం­చడం విశేషం. మరో­వైపు ఆంధ్ర­ప్ర­దే­శ్‌లో ప్రతి­పక్ష నాయ­కుడు వైఎస్ జగన్‌ కాంగ్రెస్ అధ్య­క్షు­రాలు వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల కోసం న్యాయ­వి­వాదం మొద­లైంది. అన్నా­చె­ల్లెళ్ల మధ్య ఆస్తుల పంప­కాల గొడ­వలు ముదు­రు­పా­కాన పడ్డాయి. ఇక ఆంధ్ర­ప్ర­దే­శ్‌కు మోదీ ప్రభుత్వం ఘనంగా ఇస్తు­న్నట్లు ప్రక­టిం­చిన అమ­రా­వతి రైల్వే­లైన్‌ కాస్తా సింగిల్‌ లైనే­నని తేలి­పో­వ­డంతో రాష్ట్ర ప్రజలు ఉసూ­రు­మం­టు­న్నారు.

తెలుగు రాష్ట్రాల రాజ­కీ­యాలు సరి­కొత్త మలు­పులు తిరు­గు­తు­న్నాయి. ఇంత­కు­ముందు ఆంధ్ర­ప్ర­దే­శ్‌లో జగన్‌ ప్రభుత్వం అధి­కా­రంలో ఉన్న­ప్పుడు స్కిల్‌ డెవ­ల­ప్‌­మెంట్‌ స్కాం అంటూ అప్పటి మాజీ ముఖ్య­మంత్రి చంద్ర­బా­బును అరెస్టు చేసి దాదాపు 50 రోజు­లకు పైగా జైల్లో పెట్టింది. తాజాగా తెలం­గా­ణ­లోనూ ఈ తరహా వ్యవ­హా­రాలు మొద­ల­య్యేలా కని­పి­స్తు­న్నాయి. గత సర్కా­రులో కీలక నేతలు నంబరు 1 నుంచి 8 వరకు అంద­రినీ అరెస్టు చేస్తా­మని రెవెన్యూ శాఖ మంత్రి పొంగు­లేటి శ్రీని­వా­స­రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక్క­సా­రిగా సంచ­లనం రేపాయి. బీఆ­ర్‌­ఎస్ ప్రభు­త్వంలో అక్ర­మా­లకు పాల్ప­డ్డా­రంటూ కొందరు నేతల విష­యాన్ని పరో­క్షంగా ప్రస్తా­విం­చిన పొంగు­లేటి.. ఏకంగా సియోల్‌ పర్య­ట­నలో సైతం దాని గురించి మాట్లా­డారు. అక్ర­మా­లకు పాల్ప­డిన వారం­దరి గురించి ఫైళ్లు రెడీ అయ్యా­యని, దీపా­వళి టపా­సులా ఏదో ఒక కుంభ­కోణం పేలు­తుం­దనీ వ్యాఖ్యా­నిం­చారు. ఈ వ్యాఖ్యల లోతు చూస్తే ఆయ­నేదో ఆషా­మా­షీగా అన్నట్లు కని­పిం­చడం లేదు. ఎందు­కంటే.. అన్నిం­టికీ తమ దగ్గర పక్కా ఆధా­రా­లు­న్నా­యని, ఎవ­రినీ వది­లి­పె­ట్టేది లేదని కచ్చి­తంగా చెబు­తు­న్నారు.
కేసీ­ఆర్‌ నేతృ­త్వంలో బీఆ­ర్‌­ఎస్ ప్రభుత్వం (మొదట్లో టీఆ­ర్‌­ఎస్) పదేళ్ల పాటు చాలా బలం­గానే కని­పిం­చింది. తర్వాత కూడా అధి­కా­రం­లోకి రావడం ఖాయ­మ­న్న­ట్లు­గానే గులాబి నేతలు గట్టిగా భావిం­చారు. బహుశా అందు­కే­నేమో.. ఫోన్‌ ట్యాపింగ్‌, ధరణి, భూము­లకు సంబం­ధిం­చిన పలు వ్యవ­హా­రాల్లో ఆ పార్టీ నేతలు ఒక రకంగా చెప్పా­లంటే రెడ్‌ హ్యాండె­డ్‌­గానే దొరి­కి­పో­యారు. పైకి అధి­కా­రులే ప్రస్తు­తా­నికి కని­పి­స్తున్నా, వాటి వెనక నేతల హస్తం ఉంద­న్నది బహి­రంగ రహస్యం. ఉన్న­త­స్థాయి నుంచి ఒత్తిళ్లు రాకుం­డానే పోలీసు అధి­కా­రులు తమం­తట తాముగా ప్రతి­పక్ష నాయ­కులు, సినిమా నటీ­న­టులు, వ్యాపా­రులు.. ఇలా పలు వర్గా­లకు చెంది­న­వారి ఫోన్లు ట్యాపింగ్‌ చేయడం, అందు­కోసం అత్యా­ధు­నిక పరి­క­రా­లను విదే­శాల నుంచీ తెప్పిం­చడం ఎంత­వ­రకు సాధ్య­మ­న్నది అంద­రికీ తెలుసు. అయితే అను­కోని పరి­స్థి­తుల్లో అనూ­హ్యంగా బీఆ­ర్‌­ఎస్ ఈసారి ఎన్ని­కల్లో మట్టి­క­రి­చింది. స్పష్ట­మైన మెజా­రి­టీతో కాంగ్రెస్ పార్టీ అధి­కా­రం­లోకి వచ్చింది.
సాధా­ర­ణంగా ప్రాంతీయ పార్టీల నేతలు, అందు­లోనూ ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడి, ఆ రాష్ట్రం సిద్ధిం­చిన తర్వాత దానికి అధి­నే­త­లుగా అయి­న­వారు కొంత­మం­దిని చూస్తుంటే.. ఇలా వాళ్ల మీద ఏదో ఒక తరహా కేసులు రాక మానడం లేదు. ఈ అన్ని సంద­ర్భా­ల్లోనూ చూసు­కుంటే నిజం­గానే వాళ్లు ఏవైనా అక్ర­మా­లకు పాల్ప­డ్డారా.. లేదా కావా­లనే అధి­కా­రం­లోకి వచ్చిన జాతీయ పార్టీలు వాళ్ల మీద కక్ష సాధిం­చ­డా­నికి ఇలా చేస్తు­న్నాయా అన్న అను­మానం రాక మానదు. ప్రాంతీయ పార్టీ­లకు గట్టి అభి­మా­నులు ఉంటారు. ఒక వర్గంలో ఆయా పార్టీ­లకు అపా­ర­మైన బలం ఉంటుంది. అదే సమ­యంలో ప్రాంతీయ పార్టీలు కొత్త రాష్ట్రం తీసు­కొ­చ్చి­న­ప్పుడు వాళ్ల మీద అంచ­నాలు కూడా చాలా ఎక్కు­వ­గానే ఉంటాయి. వాటిలో ఏ ఒక్కటి తీర్చ­లే­క­పో­యినా.. ముందు ఎన్ని­కల్లో గెల­వ­డా­నికి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెర­వే­ర్చ­క­పో­యినా ఫలి­తాలు దారు­ణంగా ఉంటాయి. అప్ప­టి­వ­రకు పల్ల­కీలో మోసి­న­వాళ్లే ఒక్క­సా­రిగా పల్ల­కీని తిర­గేసే ప్రమాదం లేక­పో­లేదు.
ఇప్పుడు బీఆ­ర్‌­ఎస్ నేతల పరి­స్థితి కూడా దాదాపు అలాగే తయా­రైంది. వాళ్ల మీద వస్తున్న ఆరో­ప­ణల్లో ప్రధా­న­మై­నది భూ ఆక్ర­మ­ణలు, అక్రమ కొను­గోళ్లు. అధి­కా­రంలో ఉండగా దాదాపు ప్రతి­చోటా కొత్తగా ఏదో ఒక అభి­వృద్ధి ప్రాజెక్టు పేరుతో వేల ఎక­రాల భూము­లను బీఆ­ర్‌­ఎస్ నేతలు కారు­చౌ­కగా ముందే కొనేసి పెట్టు­కు­న్నా­రని, ఆ తర్వాతే అక్కడ ప్రాజె­క్టులు ప్రక­టించి వాటి రేట్లు పెంచు­కు­న్నా­రన్న ఆరో­ప­ణలు గుప్పు­మ­నేవి. అప్పటి మంత్రులు, వాళ్ల అను­చ­రులు కూడా పలు ప్రాంతాల్లో భూములు ఆక్ర­మిం­చు­కు­న్నా­రని చెబు­తుం­టారు. కుంభ­కో­ణాలు, అవి­నీ­తితో సంపా­దిం­చిన ఆస్తు­లను రిక­వరీ చేసేం­దుకు కూడా వెన­కా­డ­బో­మని, ఆ విష­యాన్ని చట్టమే చూసు­కుం­టుం­దని పొంగు­లేటి వ్యాఖ్యా­ని­స్తు­న్నా­రంటే.. కేవలం అరె­స్టు­ల­తోనే ఆగ­క­పో­వ­చ్చన్న సిగ్నల్‌ కని­పి­స్తోంది.
పాత్రి­కే­యుల్లో కూడా చాలా­మంది బీఆ­ర్‌­ఎస్ నేతల తీరు విష­యంలో గుర్రు­గానే ఉన్నారు. జవ­హ­ర్‌­లాల్‌ నెహ్రూ జర్న­లిస్ట్స్​‍ మ్యూచు­వల్లీ ఎయి­డెడ్‌ కోఆ­ప­రే­టివ్‌ హౌసింగ్‌ సొసై­టీకి వైఎస్ రాజ­శే­ఖ­ర­రెడ్డి ముఖ్య­మం­త్రిగా ఉన్న సమ­యంలో నిజాం­పేట, పేట్‌ బషీ­రా­బాద్‌ ప్రాంతాల్లో కలిపి 70 ఎక­రాలు ఇచ్చారు. వాటిని ఆ సొసైటీ అప్పటి మార్కెట్‌ రేటు చెల్లించి మరీ కొను­గోలు చేసింది. అయితే, సంబం­ధిత జీఓ విడు­దల చేయ­డంలో అంద­రికీ కలిపి ఒకే జీఓ ఇవ్వ­డంతో దానిపై న్యాయ­వి­వాదం మొద­లైంది. ఎప్పుడో 2008లో ఒక్కొ­క్కరు అప్పులు చేసి మరీ రూ. 2 లక్షల చొప్పున కట్టినా, ఇప్ప­టికీ ఆ భూమి వారి చేతికి రాలేదు. సుప్రీం­కోర్టు తీర్పు వస్తే వెంటనే ఇచ్చే­స్తా­మని కేసీ­ఆర్‌ ఒక సమ­యంలో ప్రక­టిం­చినా.. తర్వాత తీర్పు వచ్చినా ఏమాత్రం పట్టిం­చు­కో­లేదు. అప్పట్లో… నిజాం­పేట స్థలంలో టవర్లు కట్టించి సొసైటీ సభ్యు­లం­ద­రికీ ఉచి­తంగా ఫ్లాట్లు ఇప్పి­స్తా­మని, పేట్‌ బషీ­రా­బాద్‌ సైట్‌ (38 ఎక­రాలు) తమకు వది­లే­యా­లని బీఆ­ర్‌­ఎస్ వర్గాల నుంచి సొసైటీ నేత­లకు ఫీలర్లు కూడా వది­లి­నట్లు అన­ధి­కా­రిక సమా­చారం. అయితే, సభ్యు­లం­ద­రికీ సొంత ఇళ్ల కోసమే స్థలాలు రావా­లన్న ఉద్దే­శంతో సొసైటీ ఏర్ప­డి­నం­దున.. నాయ­కులు ఆ ప్రలో­భా­లకు, ఒత్తి­ళ్లకు తలొ­గ్గ­లేదు. ఎట్ట­కే­లకు రేవంత్‌ రెడ్డి సీఎం అయిన తర్వాత కొంత వరకు మార్గం సుగ­మ­మైంది.
ఇలా భూముల విష­యంలో బీఆ­ర్‌­ఎస్ నాయ­కుల మీద చాలా ఆరో­ప­ణలు వచ్చాయి. అందుకే రెవెన్యూ మంత్రి కూడా అయిన పొంగు­లేటి శ్రీని­వా­స­రెడ్డి కాస్త గట్టి­గానే స్పందిం­చారు. ధర­ణి–­భూ­ముల అక్ర­మా­లకు సంబం­ధిం­చిన అంశా­లనే వెలు­గు­లోకి తెచ్చి కేసులు పెడ­తా­రని సమా­చారం. ధరణి చట్టం వచ్చాక అనేక భూ లావా­దే­వీల్లో అవ­క­త­వ­కలు జరి­గా­యని ఆరో­ప­ణలు వస్తున్న సంగతి తెలి­సిందే. ఇదే అంశంలో సీసీ­ఎ­ల్‌ఏ స్థాయిలో క్లియర్‌ చేయా­ల్సిన కొన్ని భూముల అంశా­లను.. కలె­క్టర్ల స్థాయి­లోనే చేసే­శా­రనే ఆరో­ప­ణలు ఉన్నాయి. ధరణి వ్యవ­హా­రా­లను ఒక ప్రైవేటు సంస్థ టెరా­సి­స్కు ఇచ్చి, దాన్ని అడ్డు­పె­ట్టు­కుని కూడా కొన్ని లావా­దే­వీలు అక్ర­మంగా చేశా­రన్న సమా­చారం ప్రభుత్వం వద్ద ఉన్నట్లు తెలు­స్తోంది. వీట­న్నింటి దృష్ట్యా తీవ్ర చర్యలు తీసు­కునే అవ­కాశం లేక­పో­లే­దని తెలు­స్తోంది.
అయితే.. పొంగు­లేటి వ్యాఖ్యల మీద కేటీ­ఆర్‌ కూడా కాస్త గట్టి­గానే స్పందిం­చారు. నిజ­మైన బాంబు­లకే తాము భయ­ప­డ­లే­దని.. ఏం చేస్తారో చేసు­కో­మని సవాల్‌ విసి­రారు. చంద్ర­బాబు, వైఎ­స్­ఆర్‌ వంటి వారి­తోనే పోరాటం చేశా­మని.. మీరో లెక్కా అంటూ విరు­చు­కు­ప­డ్డారు. పొంగు­లేటి బాంబులు తుస్సే అంటూ వ్యాఖ్యా­నిం­చారు. తాము ఒరి­జ­నల్‌ బాంబు­లకే భయ­ప­డ­లే­ద­న్నారు. అంతే కాదు.. పోలీ­సు­లను కూడా ఒక రకంగా కేటీ­ఆర్‌ హెచ్చ­రిం­చారు. అధి­కా­రులు జాగ్ర­త్తగా చూసు­కుని పోవా­లని, తేడా వస్తే మిత్తితో సహా అన్నీ తేలు­స్తా­మని.. ఇప్పుడు అతిగా ప్రవ­ర్తించే అధి­కా­రుల పేర్లన్నీ రాసి పెట్టు­కుం­టా­మని ఆయన వ్యాఖ్యా­నిం­చారు. కేటీ­ఆర్‌ వ్యాఖ్యలు చూస్తుంటే, సార్వ­త్రిక ఎన్ని­క­లకు ముందు ఆంధ్ర­ప్ర­దే­శ్‌లో ప్రస్తుత మంత్రి నారా లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలే గుర్తు­కొ­స్తు­న్నాయి. అప్పట్లో లోకేశ్‌ ఒక ఎర్రటి అట్ట ఉన్న పుస్తకం చేతిలో పట్టు­కుని.. రెడ్‌­బు­క్‌లో అందరి పేర్లూ రాస్తు­న్నా­మని, అధి­కా­రం­లోకి వచ్చిన తర్వాత ఎవ­రిని ఏం చేయాలో తమకు బాగా తెలు­సని, రెడ్‌ బుక్‌ ఆధా­రం­గానే చర్యలు ఉంటా­యని హెచ్చ­రిం­చే­వారు. అందుకు తగి­న­ట్లుగా ఇప్పుడు జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడు­స్తోం­దని విమ­ర్శి­స్తు­న్నారు. కేటీ­ఆర్‌ సైతం దాదాపు అదే గొంతు విని­పిం­చడం విశేషం.
ఇక ఆంధ్ర­ప్ర­దేశ్‌ విష­యా­ని­కొస్తే, అక్కడ అధి­కా­ర ­ప్ర­తి­ప­క్షాల మధ్య కంటే, ప్రతి­ప­క్షంలో ఒకే కుటుం­బా­నికి చెందిన రెండు పార్టీల నేతల మధ్య యుద్ధం నడు­స్తోంది. అది కూడా సొంత అన్నా­చె­ల్లెళ్ల మధ్యే కావడం విశేషం. మాజీ ముఖ్య­మంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి.. గతంలో తాను ప్రేమా­భి­మా­నా­లతో తన చెల్లెలు షర్మి­లకు కొన్ని ఆస్తులు గిఫ్ట్‍ డీడ్‌ చేశా­నని, ఆ డీడ్‌ రద్దు చేసు­కుం­టా­నని కోర్టును ఆశ్ర­యిం­చడం జాతీయ స్థాయిలో సంచ­ల­నా­త్మ­కంగా మారింది.
ఒక కంపె­నీ­లోని వాటాల గురించి వైఎస్ జగన్‌, నేష­నల్‌ కంపెనీ లా ట్రైబ్యు­నల్‌ (ఎన్‌­సీ­ఎ­ల్‌టీ)లో పిటి­షన్‌ వేశారు. ఆ పిటి­ష­న్‌లో వైఎస్ జగన్‌.. తనకు, తన సోదరి వైఎస్ షర్మి­లకు మధ్య ఉన్న విభే­దాల గురించి కూడా ప్రస్తా­విం­చారు. సర­స్వతి పవర్‌ అండ్‌ ఇండ­స్ట్రీస్ ప్రైవేట్‌ లిమి­టెడ్‌ అనే కంపె­నీలో వాటాల బది­లీకి సంబం­ధించి ఎన్‌­సీ­ఎ­ల్‌­టీలో వైఎస్ జగన్‌, ఆయన భార్య వైఎస్ భారతి పిటి­షన్‌ వేశారు. ఈ సంస్థలో తమ వాటా­లను ‘‘అక్ర­మంగా’’ తన తల్లి వైఎస్ విజ­యమ్మ పేరు మీదకు బదిలీ చేశా­రని, ఆ షేర్ల బది­లీని రద్దు చేయా­లని ఆ పిటి­ష­న్‌లో కోరారు.
సర­స్వతి షేర్ల బది­లీకి సంబం­ధించి 2019 ఆగస్టు 31న ఒక అవ­గా­హన ఒప్పందం కుదు­ర్చు­కు­న్నారు. ఆ ఒప్పందం ప్రకారం విజ­య­మ్మను ట్రస్టీగా ఉంచి ఆ ట్రస్ట్‍ ద్వారా షర్మి­లకు కంపెనీ షేర్లు భవి­ష్య­త్తులో బదిలీ చేస్తారు. అది కూడా వైఎస్ జగన్‌, ఆయన భార్య భారతి సమ్మతి మేరకు నిర్ణయం తీసు­కుం­టారు. అందులో భాగంగా వైఎస్ జగన్‌, ఆయన భార్య భారతి కొన్ని ఈక్విటీ షేర్లను వైఎస్ విజ­య­మ్మకు బహు­మ­తిగా ఇచ్చారు. భవి­ష్య­త్తులో కోర్టు అను­మ­తులు లభిం­చాక జగన్‌, ఆయన భార్య అంగీ­కారం మేరకు షేర్లను బదిలీ చేయా­లనే ఉద్దే­శంతో ఆ షేర్లను బహు­మ­తిగా ఇచ్చి­నట్లు పేర్కొ­న్నారు. అంటే ఆ గిఫ్ట్‍ డీడ్‌ను జగన్‌, భార­తిల అను­మతి లేకుండా ఎగ్జి­క్యూట్‌ చేయ­డా­నికి వీల్లేదు. కానీ, తమ అను­మతి లేకుం­డానే ఆ గిఫ్ట్‍ డీడ్‌ను ఎగ్జి­క్యూట్‌ చేశా­రని పిటి­ష­న్‌లో జగన్‌, ఆయన భార్య పేర్కొ­న్నారు. షర్మిల ప్రోద్బ­లం­తోనే విజ­యమ్మ షేర్లు తన పేరు­మీ­దకు బదిలీ చేయిం­చు­కు­న్నా­రని, షర్మిల ముందస్తు ఆలో­చ­న­తోనే ఉద్దే­శ­పూ­ర్వ­కం­గానే అలా వ్యవ­హ­రిం­చా­రని జగన్‌ దంప­తులు భావిం­చారు. షర్మిల అను­బంధం మరి­చి­పోయి వ్యక్తి­గత దూష­ణ­లకు కూడా దిగా­రని, ఈ పరి­స్థి­తుల నేప­థ్యంలో ఆ వాటా­లను తిరిగి తీసు­కో­వా­లని భావి­స్తు­న్నా­మని జగన్‌ తన పిటి­ష­న్‌లో తెలి­పారు.
ఈ వ్యవ­హారం అంతా చూస్తే.. నిజా­నికి గిఫ్ట్‍ సెటి­ల్‌­మెంట్‌ డీడ్‌ అనేది ఆస్తుల బది­లీలో ఒక పద్ధతి. సాధా­రణ వ్యక్తు­లైతే వీలు­నామా రాస్తారు. తండ్రి నుంచి పిల్ల­లకు దక్కా­ల్సిన ఆస్తి­పా­స్తుల వివ­రా­లను ఎవ­రె­వ­రికి ఎంతెంత వాటా ఇవ్వాలో ప్రస్తా­విస్తూ వీలు­నామా సిద్ధం చేస్తారు. అయితే, ఈ వీలు­నా­మాను రాసి­న­వాళ్లు తమ జీవి­త­కా­లంలో ఎప్పుడు కావా­లంటే అప్పుడు మార్చు­కో­వచ్చు. అదే గిఫ్ట్‍ సెటి­ల్‌­మెంట్‌ డీడ్‌ రాస్తే మాత్రం.. దాన్ని మార్చా­లంటే తప్ప­ని­స­రిగా కోర్టుకు వెళ్లాలి. ఆ కోర్టు ఎవరి పేరు­మీద అయితే గిఫ్ట్‍ డీడ్‌ ఉందో, వాళ్లను కూడా పిలి­పి­స్తుంది. ఎందుకు మార్చా­ల­ను­కుం­టు­న్నా­రన్న విష­యాన్ని ఆస్తి అసలు యజ­మాని (తండ్రి లేదా వేరే ఎవ­రైనా) కోర్టుకు సమ­ర్థంగా వివ­రిం­చ­గ­లి­గితే, కోర్టు ఆ వాద­నతో సంతృప్తి చెందితే అప్పుడు ఆ గిఫ్ట్‍ డీడ్‌ను రద్దు­చే­స్తుంది.
తన పిటి­ష­న్‌లో ‘‘జగ­న్‌కు, షర్మి­లకు మధ్య అన్నా­చె­ల్లెళ్ల మధ్య ఉండే ప్రేమ బంధం లేదు’’ అని పేర్కొ­నడం చర్చ­నీ­యాం­శ­మైంది. ‘‘జగన్‌ పట్ల కృత­జ్ఞత లేక­పో­వ­డమే కాదు, ఆయన మంచిని పట్టిం­చు­కో­కుండా షర్మిల వ్యవ­హ­రి­స్తు­న్నారు. బహి­రం­గంగా జగన్‌ మీద అనేక తప్పుడు ఆరో­ప­ణలు చేశారు. షర్మిల తీరు రాజ­కీ­యంగా జగ­న్‌ను వ్యతి­రే­కిం­చ­డమే కాకుండా ఆయన గౌర­వా­నికి భంగం కలి­గేలా ఉంది. అందు­వల్ల అన్నా­చె­ల్లెళ్ల మధ్య ఉండా­ల్సిన ప్రేమ, అభి­మానం కరి­గి­పో­యాయి’’ అని నేరుగా పిటి­ష­న్‌­లోనే రాశారు. దాంతో­పాటు తామి­ద్దరి మధ్య జరి­గిన ఉత్తర ప్రత్యు­త్త­రా­లను కూడా కోర్టు దృష్టికి తీసు­కెళ్లి, వాటిని సాక్ష్యా­లుగా పరి­గ­ణ­న­లోకి తీసు­కో­వా­లని కోరడం సరి­కొత్త విషయం. దాన్ని కోర్టు కూడా పరి­గ­ణ­న­లోకి తీసు­కుంది.
షర్మిల వైఎ­స్సార్‌ తెలం­గాణ పార్టీ పెట్టి­న­ప్పుడు జగన్‌ దాని గురించి ఏమీ స్పందిం­చ­లేదు. ఆ తర్వాత 2024 అసెంబ్లీ ఎన్ని­కల ముందు ఆమె తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయ­డంతో పాటు.. ఆంధ్ర­ప్ర­దేశ్‌ కాంగ్రెస్ అధ్య­క్షు­రా­లిగా బాధ్య­తలు చేప­ట్టారు. అప్ప­ట్నుంచి తన అన్న జగన్‌ మీద నేరుగా విమ­ర్శలు చేయడం ప్రారం­భిం­చారు. మాజీ మంత్రి వైఎస్ వివే­కా­నం­ద­రెడ్డి హత్య కేసు గురించి ప్రస్తా­విస్తూ, ఆయన కుమార్తె సునీ­తను వెంట పెట్టు­కుని వివేకా హత్యకు జగనే కార­కు­డంటూ ఘాటు విమ­ర్శ­లకు దిగారు. జగ­న్‌ను, అప్పటి కడప ఎంపీ అవి­నాష్‌ రెడ్డిని టార్గెట్‌ చేయ­డా­నికి ఒక ప్రధా­నా­స్త్రంగా వివేకా హత్య ­కే­సును వాడు­కు­న్నారు. అప్పట్లో టీడీపీ వర్గాలు కూడా సునీ­తకు గట్టి­గానే మద్ద­తి­చ్చి­నట్లు కని­పిం­చాయి. అయితే, ఎన్ని­కలు అయిన మరు­క్షణం నుంచి వివేకా హత్య­కేసు దర్యాప్తు వ్యవ­హారం ఒక్క­సా­రిగా మటు­మాయం అయి ­పో­యింది. దాని గురించి సునీత పట్టు­బ­ట్టడం లేదు, షర్మిల ఏమీ అన­ట్లేదు, చంద్ర­బాబు ప్రభుత్వం కూడా పట్టిం­చు­కో­వడం లేదు.
గత సార్వ­త్రిక ఎన్ని­కల్లో తన ఓట­మికి ఉన్న ప్రధాన కార­ణాల్లో షర్మిల విమ­ర్శలు, తీవ్ర ఆరో­ప­ణలు కూడా ఉన్నా­య­న్నది జగన్‌ నిశ్చి­తా­భి­ప్రాయం. షర్మి­లతో విభే­దాలు ఇక­పైనా కొన­సా­గు­తా­యనే బల­మైన సంకేతం ఇవ్వ­డా­నికే జగన్‌ ఈ పిటి­షన్‌ వేశా­రని స్పష్టంగా తెలు­స్తోంది. భారతి సిమెంట్స్​‍, సాక్షిలో కూడా మన­వడు, మన­వ­రా­ళ్లకు (మొత్తం నలు­గురు) సమాన వాటాలు రావా­లని షర్మిల అంటు­న్నారు. అంటే కేవలం వైఎస్ రాజ­శే­ఖ­ర­రెడ్డి ఇచ్చిన ఆస్తులే కాకుండా.. ఆయన బతి­కున్న సమ­యంలో జగన్‌ ప్రారం­భిం­చిన వ్యాపా­రా­ల్లోనూ తమకు వాటాలు ఉంటా­య­న్నది షర్మిల వాద­నలా కని­పి­స్తోంది. చట్ట­ప్ర­కారం ఈ వాద­నలు ఎంత­వ­రకు నిలు­స్తా­య­న్నది, ఎవ­రిది పైచేయి అవు­తుం­ద­న్నది కోర్టులు తేలు­స్తాయి. కానీ, ఈలోపు అన్నా­చె­ల్లెళ్ల మధ్య ఉన్న గొడ­వలు తార­స్థా­యికి చేరి­పో­వడం శోచ­నీయం. తన వ్యక్తి­త్వాన్ని హననం చేయడం వల్లే ఇప్పుడు ఈ వివా­దాన్ని జగన్‌ మొద­లు­పె­ట్టా­ర­న్నది స్పష్టంగా తెలు­స్తోంది. పోతే పోయిం­దని వది­లే­య­కుండా.. షర్మిల కూడా దీని­మీద గట్టి పట్టు­ద­ల­తోనే వ్యవ­హ­రి­స్తు­న్నారు.
ఇదంతా ఒక ఎత్త­యితే.. ఆంధ్ర­ప్ర­దే­శ్‌కు కేంద్ర ప్రభుత్వం చాలా ఇచ్చే­స్తు­న్నట్లు ప్రతి­సారీ ప్రక­టి­స్తూనే… చివ­రకు మొండి­చేయి చూపి­స్తోం­ద­న్నట్లు కని­పి­స్తోంది. అమ­రా­వతి రైల్వే­లైన్‌ మంజూరు చేస్తు­న్నట్లు రైల్వే­మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఘనంగా ప్రక­టిం­చారు. అది చూసి ఆంధ్ర­ప్ర­దేశ్‌ ప్రభుత్వ పెద్దల నుంచి రాష్ట్ర ప్రజల వరకు ప్రతి ఒక్కరూ ఎంత­గానో ఉబ్బి­పో­యారు. ఇంకే­ముంది, అమ­రా­వ­తికి రైలు కనె­క్టి­విటీ కూడా వచ్చే­సి­న­ట్లే­నని సంబ­ర­ప­డ్డారు. కానీ, గతంలో పవన్‌ కల్యాణ్‌ విమ­ర్శిం­చి­న­ట్లుగా ఈసారి కూడా ఇచ్చింది పాచి­ల­డ్డూ­ల్లాగే ఉన్నాయి. ఎందు­కంటే, ఒక­వైపు దేశ­వ్యా­ప్తంగా ఉన్న రెండు లైన్లం­టినీ నాలుగు లైన్లకు విస్త­రిం­చా­లని రైల్వే­శాఖ భావి­స్తుంటే.. ఇప్పుడు కొత్తగా వేయ­బోయే అమ­రా­వతి లైను మాత్రం సింగిల్‌ లైను­గానే ఉండ­బో­తోంది. ఇంత­కు­ముందు గుడి­వా­డ­భీ­మ­వ­రం­న­ర­సా­పురం లాంటివి సింగిల్‌ లైన్లుగా ఉండేవి. ఆ మార్గాల్లో ప్రయా­ణిం­చే­వారు అను­భ­విం­చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అక్క­డకు ఉండే రైళ్లే పరి­మి­తంగా ఉంటాయి, అవీ ఏ సమ­యంలో రెండు రైళ్లు ఒకే­సారి వెళ్లా­లన్నా, క్రాసింగ్‌ పేరు చెప్పి రెండో­దాన్ని గంటల తర­బడి ఆపే­స్తారు. ఒక­వైపు హైస్పీడ్‌ రైల్‌ కారి­డార్లు వేయా­లని తల­పె­డుతూ.. మరో­వైపు ఇప్పుడు కూడా సింగిల్‌ లైన్‌ కేటా­యిం­చడం వెనక పర­మార్థం ఏంటో కేంద్ర ప్రభుత్వ పెద్ద­లకే తెలి­యాలి. పైపెచ్చు, ఇది ఇప్పు­డంటే చెబు­తు­న్నారు గానీ, ఎప్ప­టికి పూర్త­వు­తుం­ద­న్నది అగ­మ్య­గో­చ­రమే. ఎందు­కంటే.. ఎప్పుడో 1998లో నాటి రైల్వే­మంత్రి మమతా బెనర్జీ శంకు­స్థా­పన చేసిన కోటి­ప­ల్లి­ న­ర­సా­పురం లైనుకు ఇప్ప­టి­వ­రకు మోక్షం లేదు. కనీసం సర్వే కూడా పూర్తి కాలేదు. ఇలాగే కొవ్వూ­రు­భ­ద్రా­చలం లాంటి చాలా లైన్లు ఏమాత్రం కద­లిక లేకుండా ఎక్కడి గొంగళి అక్కడే అన్న­ట్లు­న్నాయి. వీటి కంటే అమ­రా­వతి లైను కొంత వేగంగా వెళ్లే అవ­కాశం ఉన్నా.. నాలు­గే­ళ్లలో మాత్రం పూర్తయ్యే అవ­కా­శాలు కని­పిం­చడం లేదు. దాదాపు రూ.2,250 కోట్లు వెచ్చి­స్తా­మని చెబు­తున్నా, ఇది సింగిల్‌ లైన్‌ కావడం వల్ల కేంద్రం చెబు­తు­న్నట్లు ఉత్త­ర­ ద­క్షిణ భార­త­దే­శాల మధ్య అను­సం­ధా­నికి ఇది ఏమాత్రం పని­కి­రాదు. ఎన్డీయే 1 ప్రభు­త్వం­లోనే దీనికి ఆమోదం తెలి­పినా, ఇప్పుడు ప్రక­టన వరకు వచ్చారు. అమ­రా­వతి లాంటి గ్రీన్‌­ఫీల్డ్​‍ రాజ­ధా­నికి కనీసం డబుల్‌ లైన్‌ ఉంటేనే ఉప­యోగం. మిగి­లిన చోట్ల మూడు, నాలుగు లైన్లు ఉన్న­ప్పుడు.. అందు­లోనూ రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ లైన్‌ కావా­లని అడి­గినా కూడా సింగిల్‌ లైన్‌ మాత్రమే ఇచ్చి, అదేదో చాలా గొప్ప పని అన్నట్లు కేంద్రం ప్రక­టిం­చు­కో­వడం.. దానికి రాష్ట్రం­లోని పాల­క­ప­క్షా­లైన టీడీపీ, జన­సేన, బీజేపీ అన్నీ భజన చేయడం సామా­న్యు­డికి ఏమాత్రం నచ్చ­ట్లేదు. ప్రస్తు­తా­నికి అందరి మధ్య సంబం­ధాలు బాగు­న్నాయి కాబట్టి సరే. రేపు ఏమాత్రం తేడా వచ్చినా.. పవన్‌ కళ్యాణ్‌ లాంటి ఆవే­శ­ప­రు­లైన నాయ­కులు దీన్ని కూడా మళ్లీ పాచి­పో­యిన లడ్డూ­ల­తోనే పోల్చడం ఖాయం.

  • –7674869432
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News