Deputy Collectors| ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఏకంగా 32 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లను ఏపీ సీఆర్డీఏ(CRDA)లో పోస్టింగ్ ఇచ్చారు. ఇక ప్రోటోకాల్ డైరెక్టర్‌గా టి.మోహన్‌రావును నియమించారు. ఏపీఐఐసీ(APIIC) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పి.రచన, శ్రీకాళహస్తి దేవాలయం ఈవోగా టి.బాపిరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక ఏపీ శిల్పారామం సొసైటీ సీఈవోగా వి.స్వామినాయుడు, సీసీఎల్ఏ సహాయ కార్యదర్శిగా డి.లక్ష్మా రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పరిపాలన సౌలభ్యం కోసమే 32 మంది అధికారులను బదిలీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కాగా ఇటీవలే తెలంగాణ నుంచి వచ్చిన ఏపీ క్యాడర్ అధికారులకు పోస్టింగులు ఇస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఆమ్రపాలిని ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా నియమించడంతో పాటు టూరిజం అథారిటీ సీఈవోగా ఆమెకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక పురావస్తు, మ్యూజియం శాఖ కమిషనర్ జి.వాణిమోహన్‌ను బదిలీ చేసి సాధారణ పరిపాలన శాఖలో సర్వీసుల వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం ఆ బాధ్యతలు చూస్తున్న పోలా భాస్కర్‌ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్‌ను నియమించారు. కార్మిక శాఖ అదనపు బాధ్యతల నుంచి ఎం.ఎం.నాయక్‌ను రిలీవ్ చేశారు. ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా వాకాటి కరుణను నియమించారు. అలాగే జాతీయ హెల్త్ మిషన్ డైరెక్టర్‌గా ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించారు.