Bandi Sanjay| తెలంగాణ రాజకీయాలు మూడు నోటీసులు, ఆరు విమర్శలుగా కొనసాగుతున్నాయి. రాజకీయ విమర్శల నేపథ్యంలో నేతలు ఒకరికి ఒకరు లీగల్ నోటీసులు పంపించుకుంటున్నారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) పంపించిన పరువునష్టం నోటీసులపై కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఘాటుగా స్పందిస్తూ కౌంటర్ నోటీసులు పంపించారు. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు. తాను మాట్లాడిన మాటల్లో ఎక్కడా కేటీఆర్ పేరు ప్రస్తావించలేదని చెప్పుకొచ్చారు. రాజకీయ విమర్శలపై తనకు నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
లీగల్ నోటీసులో కేటీఆర్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని, నిరాధారమైనవని పేర్కొన్నారు. లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. తనపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. నిరాధారమైన ఆరోపణలకు రుజువులు లేకుండా, దురుద్దేశపూర్వకంగా తన క్లయింట్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారని బండి సంజయ్ తరఫు న్యాయవాది కౌంటర్ నోటీసులు దాఖలు చేశారు.
కాగా ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ వ్యవహారాల్లో తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. వారంలోపు క్షమాపణలు చెప్పకపోతే బండి సంజయ్‌పై లీగల్ యాక్షన్ తప్పదని హెచ్చరించారు. తాజాగా ఈ నోటీసులపై బండి తనదైన శైలిలో స్పందించారు.