Wednesday, October 30, 2024
HomeదైవంTirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. రేపు వీఐపీ దర్శనాలు రద్దు

Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. రేపు వీఐపీ దర్శనాలు రద్దు

Tirumala| గత కొద్ది రోజులుగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. దీంతో వైంకుంఠం కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈనేపథ్యంలో భక్తులు వేగంగా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. టోకెన్ లేని భక్తులకు ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. ఇక మంగళవారం స్వామి వారిని 59,140 మంది భక్తులు దర్శించుకోగా.. 16,937 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.31 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

- Advertisement -

మరోవైపు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. కేవలం ప్రోటోకాల్ ప్రముఖులు మినహా మిగతా వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ఇందుకు భక్తులు సహకరించాలని కోరారు.

ఇక తిరుమలలో నవంబర్ నెలకు సంబంధించి, జరిగే విశేష పర్వదినాలను టీటీడీ ప్రకటించింది. నవంబరు 1న కేదారగౌరీ వ్రతం, నవంబరు 3న భగినీహస్త భోజనం, శ్రీ తిరుమలనంబి శాత్తుమొర, నవంబరు 5న నాగుల చవితి, పెద్ద శేష వాహనం, నవంబరు 6న శ్రీ మనవాళ మహామునుల శాత్తుమొర, నవంబరు 8న వార్షిక పుష్పయాగానికి అంకురార్పణ, నవంబరు 9న శ్రీవారి పుష్పయాగం, అత్రి మహర్షి వర్ష తిరునక్షత్రం, పిళ్లైలోకాచార్య వర్ష తిరు నక్షత్రం, పోయిగైయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, పూదత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, వేదాంత దేశికుల శాత్తుమొర, 10న పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, నవంబరు 11న శ్రీ యాజ్ఞవల్క్య జయంతి, నవంబరు 12న ప్రబోధన ఏకాదశి, నవంబరు 13న కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస్య వ్రత సమాప్తి, నవంబరు 15న కార్తీక పౌర్ణమి, 28న ధన్వంతరి జయంతి, 29న మాస శివరాత్రి పర్వదినాలు నిర్వహిస్తున్నట్లు ఈవో శ్యామలరావు తెలిపారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News