Asaduddin Owaisi| బీఆర్ఎస్ నేతలపై ఎంఐఎం(MIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు. గులాబీ నేతల జాతకాలు తన దగ్గర ఉన్నాయని.. తాను నోరు విప్పితే తట్టుకోలేరని హెచ్చరించారు. మూసీ ప్రక్షాళనకు బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. ఇళ్లు కదల్చకుండా మూసీ ప్రక్షాళన చేస్తే స్వాగతిస్తామన్నారు. తమ పార్టీ కాంగ్రెస్(Congress)తో జతకట్టందని.. బీఆర్ఎస్ ఆరోపిస్తుందని మండిపడ్డారు. కానీ గతంలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తమ మద్దతుతోనే ఎక్కువ సీట్లు గెలిచిన విషయాన్ని మర్చిపోయారా..? అని ప్రశ్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతల అహంకారం వల్లే ఓడిపోయారని తెలిపారు.
ఇక ఎక్కువ మంది సంతానం కనాలని ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu), తమిళనాడు సీఎం స్టాలిన్(Stalin) అంటున్నారని.. అదే విషయాన్ని తాను చెప్పి ఉంటే పెద్ద రాద్ధాంతం చేసేవారని పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో జననాల రేటు తక్కువగా ఉందని చంద్రబాబు గుర్తించారని తెలిపారు. జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల సంఖ్య తగ్గుతుందన్నారు.
అలాగే తిరుమలలో పనిచేసే వారందరూ హిందువులే అయి ఉండాలని టీటీడీ నూతన చైర్మన్ బి.ఆర్ నాయుడు(BR Naidu) చేసిన వ్యాఖ్యలపై కూడా ఘాటుగా స్పందించారు అసదుద్దీన్. ఆయన వ్యాఖ్యలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. తిరుమలేమి ఆయన జాగీరు కాదని ధ్వజమెత్తారు. అలాగైతే వక్ఫ్ బోర్డులో ఇతర మతస్తులను నియమించేలా బిల్లులు ఎందుకు తెస్తున్నారని ప్రశ్నించారు. టీటీడీ బోర్డులో మాత్రమే కాదని అనేక హిందూ సంస్థల్లో ఇతర మతస్తుల ప్రవేశానికి అవకాశం ఉండదన్నారు. కానీ వక్ఫ్ బోర్డు, వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమ్స్ కానీ వారిని ఎందుకు పెడుతున్నారని ఒవైసీ నిలదీశారు.
అయితే ఒవైసీ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి(Vishnuvardhan reddy) కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. వక్ఫ్ బోర్డు కేవలం కమ్యూనిటీ సంస్థ అని గుర్తు చేశారు. తిరుమల గురించి ఆయనకేమీ తెలుసని మండిపడ్డారు. హిందువుల పవిత్ర స్థలం తిరుమల అని చెప్పుకొచ్చారు. ముస్లింల పవిత్ర స్థలమైన మక్కాలోకి హిందువులను అడుపెట్టనీయరు కదా అని ప్రశ్నించారు.