కరోనా సృష్టించిన విపత్కర, క్లిష్ట పరిస్థితుల నుండి కోలుకుని.. ఇప్పుడిప్పుడే అన్ని కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. ఉద్యోగులు నేరుగా ఆఫీసులకు వెళ్లి పనిచేస్తున్నారు. ఇలాంటి సమయంలో మరో అంటువ్యాధి భయాందోళనకు గురిచేస్తోంది. దాని పేరు మీజిల్స్. చిన్నారులకు త్వరగా వ్యాపించే అంటువ్యాధి. ఈ వ్యాధికి వ్యాక్సినేషన్ ఉన్నా.. రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న చిన్నారులు మరణిస్తున్నారు. ఇటీవల 8 నెలల చిన్నారి మీజిల్స్ కారణంగా మరణించింది.
మనదేశంలోని ఆరు రాష్ట్రాల్లో మీజిల్స్ కేసులు నమోదవుతున్నాయి. బీహార్, గుజరాత్, హరియాణా, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్రల్లోని కొన్ని జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటం పట్ల కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అప్రమత్తమైంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 233 కేసులు నమోదవ్వగా.. వాటిలో 200 కేసులు రెండునెలల వ్యవధిలో నమోదైనవే. బుధవారం (నవంబర్ 23) ఒక్కరోజే 30 మంది చిన్నారులు మీజిల్స్ తో ఆస్పత్రిలో చేరారు. ఇప్పటివరకూ 12 మంది చిన్నారులు మీజిల్స్ తో మరణించారు. దగ్గు, తుమ్ముల నుండి వెలువడే తుంపర్ల ద్వారా మీజిల్స్ వ్యాప్తి చెందుతుందని వైద్యులు తెలిపారు. చిన్నారులు మాస్కులు ధరించేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి సూచిస్తున్నారు.