సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాట్ (ఎస్టీపీ)
దీనినే వ్యర్థ జల శుద్ధి కేంద్రం అనికూడా అంటారు. గృహ, వాణిజ్య ఇతరత్రా వచ్చే (పారిశ్రామిక కాకుండా) వచ్చే వ్యర్థ జలాలను ఈ ప్లాంట్ శుద్ధి చేస్తుంది. ఇలా శుద్ధి అయిన వ్యర్థ జలాలను తిరిగి వాడకంలోకి కూడా తీసుకునిరావచ్చు. కాకపోతే ఇలా శుద్ధి జరిగిన నీటి వాడకం కేవలం మొక్కల పెంపకానికి, లేదా టాయ్‌లెట్ల ఫ్లషింగ్‌కు ఈ నీటిని పునఃవినియోగిస్తుంటారు. ఈ పద్ధతి గేటెడ్ కమ్యూనిటీల్లో కనిపిస్తుంది. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్(బీఓడీ) తో పాటు అన్ని విషతుల్యాలను తగ్గిస్తుంది.
ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఈటిపి)
ఈటీపీలు అంటే వ్యర్థ రసాయన జలాల శుద్ధి కర్మాగారం. ఇది రసాయన వ్యర్థాలతో పాటు మున్సిపల్ వ్యర్థ జలాలలో విలీనమైన ఇతరత్రా రసాయన వ్యర్థాజలాలను శుద్ధిచేయగలదు. రసాయన శుద్ధి ప్రక్రియలో భాగంగా కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ స్థాయిలను తగ్గిస్తుంది. రసాయన వ్యర్థ జలాల్లోని టోటల్ డిజాల్వ్డ్ సాల్వెంట్‌ను అంటే ఉప్పును తగ్గిస్తుంది. విడుదలైన వ్యర్థ జలాలను పునర్వినియోగానికి కూడా ఉపయోగించవచ్చు.
మూసీలోకి ఏం చేరుతోంది?
మూసీ నదిలోకి పలు ప్రాంతాల్లో నేరుగా గృహ, వాణిజ్య, ఆసుపత్రుల వ్యర్థ జలాలు చేరుతున్నాయి. అలాగే రసాయన వ్యర్థ జలాలు వచ్చి చేరుతున్నాయి. పటాన్‌చెరు పారిశ్రామిక వాడ, జీడిమెట్ల పారిశ్రామిక వాడల రెండు ఈటీపీల ద్వారా అంబర్పేట్ ఎస్టీపీ కేంద్రానికి వ్యర్థ రసాయన జలాలు వచ్చి చేరుతున్నాయి. దీనికి తోడు అక్రమంగా డంప్ చేస్తున్న వ్యర్థ జలాలు, హుసేన్ సాగర్ నుంచి వ్యర్థ జలాలు మూసీలో చేరుతున్నాయి. మొత్తంగా ‘కాక్‌టైల్ ఆఫ్ కెమికల్ వాటర్’ వచ్చి చేరుతుంది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ నది ప్రక్షాళన నమూనాపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మూసీ ప్రక్షాళన కోసం నదీ తీరం, చుట్టుపక్కల చెరువులపై నిర్మించ తలపెట్టిన ఎస్టీపీ (సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్)లతో ఎలాంటి ప్రయోజనం లేదనీ, వాటి స్థానంలో ఈటీపీ (ఎప్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్)లు ఏర్పాటు చేయాలని పర్యావరణవేత్తలు, మూసీ పరిరక్షణ ఉద్యమకారులు కోరుతున్నారు. కేవలం గృహ వ్యర్థాలను మాత్రమే శుద్ధి చేసే ఎస్టీపీలతో పెద్దగా ప్రయోజనం లేదంటున్నారు. ప్రమాదకరమైన రసాయనాలు, యాంటిబయాటిక్స్ ఆనవాళ్లు ఉన్న మూసీ, పరిసర చెరు వులను శుభ్రం చేయాలంటే ఈటీపీలు అవసరమంటున్నారు. లేదా ఆయా చెరువుల్లో ఎలాంటి వ్యర్ధాలు ఉన్నాయో అధ్యయనం చేసి ఎక్కడ ఎస్టీపీ ఉండాలో, ఎక్కడ ఈటీపీ పెట్టాలో నిర్ణయించడం మంచిదని చెబుతున్నారు. ఎస్టీపీలు మాత్రమే ఏర్పాటు చేస్తే ప్రభు త్వం ఆశించిన ప్రయోజనం నెరవేరదని చెబుతున్నారు.
ఎందుకు ఈటీ పీలు?
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం 25 వరకు ఎస్టీపీలు ఉన్నాయి. పటాన్‌చెరు ప్రాంతంలో పారిశ్రామిక వ్యర్థజలాలు శుద్ధి చేసేందుకు ఈటీపీ ఉంది. పారిశ్రామిక వ్యర్ధాలను ఈటీపీలు మాత్రమే శుద్ధి చేయగలుగుతాయి. ప్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాల్లో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. వీటిని నాలాలు, చెరువులు, బహిరంగ ప్రదేశాల్లో పారవేస్తే జనానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. తాగు నీటి వనరులన్నీ కాలుష్య కాసారాలుగా మారుతాయి. భూమిలోకి ఈ వ్యర్థాలు ఇంకి భూగర్భ జలాలు కూడా విషతుల్యంగా మారుతాయి. సిటీ శివారులు, పారిశ్రామిక ప్రాంతాల్లోని అనేక చెరువులకు ఇదే గతి పట్టింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పర్యావరణవేత్తలు, స్థానిక ప్రజల ఆందోళనల ఫలితంగా పటాన్‌చెరులో ఈటీపీ ఏర్పాటు చేసి అన్ని ఫ్యాక్టరీల వ్యర్థాలను అక్కడి పంపే ఏర్పాటు చేశారు. అయితే ఇది పూర్తి సామర్థ్యంతో పని చేయడం లేదన్నది గమనార్హం. పరిశ్రమల యజమానులు కూడా ఉత్పత్తి అయిన వ్యర్థాలను ఈటీపీకి పంపకుండా నాలాలు, చెరువుల్లో వదులుతున్న సంగతి తరచూ బయటపడుతూనే ఉంది. ఈ వ్యర్థాలతోపాటు ఇళ్లలో వినియోగించే కొన్ని రసాయనాలు వాడకుండా పారవేసే మందుల కారణంగా కూడా చెరువులు, భూగర్భ జలాల్లో ప్రమాదకర రసాయనాలు చేరుతున్నాయి. చెరువులు, నాలాల ద్వారా ఆ నీరు మూసీలోకి చేరుతోంది.
మూసీ నీటిలో సూపర్ బగ్
మూసీపై దేశ విదేశీ సంస్థలు, వర్సిటీలు, రీసెర్చర్లు అనేక పరిశోధనలు చేశారు. మూసీ నది ఎంత ప్రమాదకరంగా మారిందో చెప్పారు. ఆ నీటిలో ఎలాంటి విషపూరిత పదార్థాలు ఉన్నాయో నిరూపించారు. స్వీడన్‌కు చెందిన ఒక ఆర్గనైజేషన్ భారత్ శాస్త్రవేత్తలతో కలిసి చేసిన స్టడీలో ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నదుల్లో మూసీ ఒకటని తేలింది. 140 దేశాల్లోని 250 నదులపై చేసిన సడ్డీలో మూసీ 22వ స్థానంలో నిలిచింది. ఫార్మాస్యూటికల్ పొల్యూషన్ ఇన్ వరల్డ్ రివర్స్ పేరిట చేసిన స్టడీ వివరాలు ది ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ ఆకాడమీ ఆఫ్ సైన్సెస్ అనే జర్నల్లో ప్రచురితమైంది. ఆస్ట్రేలియాకు చెందిన కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐఆర్వో), హైదరాబాద్‌లోని ఐఐసీటీతో కలిసి చేసిన మరో స్టడీలో మూసీ జలాల్లో యాంటి బయాటిక్ ఆనవాళ్లు ఉన్నట్లు తేల్చింది. అంతేకాదు వీటి వల్ల ఆ నీటిలో యాంటిబయాటిక్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా తయారవుతోందనీ, దీన్నే సూపర్ బగ్ అంటారని చెప్పింది. ఉస్మానియా, సెంట్రల్ యూనివర్సిటీతోపాటు వివిధ సంస్థలు కూడా మూసీపై పరిశోధనలు నిర్వహించి ఆ జలాల్లో ప్రమాదకరమైన ఖనిజాలు ఉన్నట్లు చెప్పాయి. సీసీఎంబీ చేసిన మరో పరిశోధనలో సిటీలోని చాలా చెరువుల్లో యాంటిబయాటిక్స్ ఆనవాళ్లు ఉన్నాయనీ, దాంతో చుట్టుపక్కల భూగర్భ జలాల్లోకి కూడా అవి చేరాయని చెప్పింది. ఈ చెరువుల్లోని నీరు మూసీలోకి చేరడం ద్వారా ఆ నీళ్లు కూడా కలుషితమవుతున్నాయని చెప్పింది. కెనడాకు చెందిన ఒక కంపెనీ ఛేం జింగ్ మార్కెట్స్ అనే రిపోర్టులో మూసీ నదిలో తీసుకున్న శాంపిళ్లలో నీటిలో ఉండాల్సిన మోతాదుకన్నా వేల రేట్ల అధిక మొత్తంలో యాం టిబయాటిక్స్ ఆనవాళ్లు ఉన్నాయని చెప్పింది. 34 ప్రాంతాల్లోని శాంపిళ్లలో 16 చోట్ల సూపర్ బగ్ ఆనవాళ్లున్నాయని పేర్కొంది. మూసీ జలాల్లోని సిప్లోఫ్లాక్సాసిన్ అనే యాంటిబయాటిక్ డ్రగ్ మోతాదుతో 14 వేల మందికి చికిత్స అందించవచ్చని చెప్పింది. దేశంలోని కలుషిత నదుల్లో మూసీ నది ఆరో స్థానమని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి చెప్పింది. మూసీ తీరాన పండించే కూరగాయలు, ఆకుకూరలు, చేపలు తినకూడదని రీసెర్చర్లు తేల్చారు. చివరకు మూసీ గడ్డి తిని, ఆ నీళ్లు తాగే బర్రెల పాలు కూడా మంచివి కావని తేల్చారు.
మూసీలోకి ఈ వ్యర్థాలు ఎలా చేరాయి?
మూసీ నది మురికి గురించి హైదరాబాద్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుసు, హైదరాబాద్ నగరం ఊపిరిపోసుకోవడానికి కారణమైన మూసీ నది ఇపుడు మురికి కాలువగా మారడం విషాదకరమైన వాస్తవం. దశాబ్దాల నిర్లక్ష్యానికి ఇది నిలువెత్తు నిదర్శనం. నానాటికి విస్తరిస్తున్న నగరంతో పాటే మూసీలో మురికి కూడా పేరుకుపోయింది. ఇళ్లలో నుంచి వచ్చే డ్రైనేజీ, ఘన వ్యర్థాలు, చెత్తాచెదారం, పరిశ్రమల నుంచి వెలువడే విష రసాయనాలు ఇలా అన్ని రకాల వ్యర్థాలను ఇందులో వేసి వదిలించుకోవడం అలవాటైపోయింది. నాలాల ద్వారా గృహ, పారిశ్రామిక వ్యర్థాలు మూసీలోకే చేరుతాయి. హైదరాబాద్, శివారుల్లోని కలుషిత చెరువుల నీరు మూసీ నదిలోనే కలుస్తాయి. హుస్సేన్‌సాగర్ నీళ్లు కూడా మూసీ నదికి చేరుతాయి. ఫలితంగా మూసీ కాలుష్యం ప్రమాద స్థాయికి చేరింది.
ఎస్టీపీలు ఉన్నా ప్రయోజనం శూన్యం
మూసీ నదిలోకి వదిలే నీటిని శుద్ధి చేసేందుకు ఇపుడు పాతిక ఎస్టీపీలు ఉన్నాయి. అయితే ఇందులో చాలా వరకు పని చేయడం లేదు. పటాన్‌చెరు ఈటీపీ నుంచి వచ్చే వ్యర్థ జలాలను ఒక భూగర్భ ట్రంక్ లైన్ ద్వారా అంబర్‌పేట ఎస్టీపీకి చేర్చుతారు. అంబర్‌పేట ఎస్టీపీ ఇన్పుట్, అవుట్‌పుట్ నీటిని పరిశీలిస్తే రెండింట్లోనూ ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నట్లు తేలింది. దీంతో ఈటీపీ పని తీరుపై పరిశోధకులు అనుమానం వ్యక్తం చేశారు. ఈటీపీ పరిస్థితే ఇలా ఉంటే ఎస్టీపీలు పారిశ్రామిక వ్యర్థాలను ట్రీట్ చేయలేవన్నది స్పష్టమవుతోంది.
రేవంత్ సర్కార్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకొని నదిని శుద్ధి చేసేందుకు డీపీఆర్‌లు తయారుచేసే పనిలో పడింది. ఇందులో భాగంగా మూసీ తీరం, ఓఆర్ఆర్ లోపల ఉండే చెరువులపై 63 ఎస్టీపీలు నిర్మించాలని కన్సల్టెంట్ల నుంచి సూచనలు అందుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో 31 ఎస్టీపీలు, మిగిలినవి శివారు (ఓఆర్ఆర్ లోపల) చెరువుల వద్ద నిర్మిస్తారు. మూసీని లండన్‌లోని థేమ్స్ నదిలా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ చెప్పారు. అయితే ఎస్టీపీల నిర్మాణం వల్ల నీరు శుద్ధి కాదనీ, విష రసాయనాలు అట్లాగే ఉండిపోతాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఎస్టీపీలకు బదులు ఆయా చెరువుల్లో ఉండే కలుషితాలను బట్టి అవసరమైన చోట ఈటీపీలు ఏర్పాటు చేయాలని చెబుతున్నారు.
ఫార్మాస్యూటికల్ వ్యర్థాలు..
సిటలో ప్రామ్, సిట్రిజిన్, కార్బమజిఫైన్, అటెనోలాల్, డిస్వెన్లాప్లాకైన్, ఫెక్సోఫెనడిన్, గాబపెంటిన్, లిడోకెయిన్, మెట్ఫార్మిన్, నాప్రోక్సిన్, సిటాగ్లిఫ్టిన్, టెమజిపమ్, ట్రైమె ప్రిమ్, వెన్లాఫాక్సిన్ (ఇవి డిప్రెషన్, పెయిన్, డయబెటిక్, బీపీ, ఆస్తమా సమస్యలకు వాడే మందులు)
మూసీలోని పరిమితికి మించి కనిపించిన భార లోహాలు..
లెడ్, కాడ్మియం, క్రోమియం, జింక్, కోబాల్ట్, కాపర్, నికెల్
మూసీలోని యాంటీ బయాటిక్స్ ఇవే..
సిప్రొఫ్లోక్సాసిన్, లోమెఫ్లోక్సాసిన్, అఫ్లోక్సిసిన్, నార్లోక్సాసిన్, ఎన్రోఫ్లోక్సాసిన్, పీప్లాక్సాసిన్
ఎస్టీపీలు అన్ని రకాల వ్యర్థాల్ని శుద్ధి చేయలేవు
సిటీ, శివారు చెరువులన్నీ కలుషితమై ఉన్నాయి. వాటిని శుద్ది చేయాలంటే ముందు అందులో ఎలాంటి విష పదార్థాలు ఉన్నాయో అధ్యయనం చేయాలి. ఎస్టీపీలు అన్ని రకాల వ్యర్థాల్ని శుద్ధి చేయలేవు. పరిశ్రమల వ్యర్థాలను శుద్ధి చేయాలంటే ఈటీపీలు కావాలి. ఈటీపీలను కూడా వ్యర్థాల్లోని రసాయనాలను బట్టి నిర్మించాలి. ఇపుడున్న ఎస్టీపీలు ఎన్ని పని చేస్తున్నాయో తెలియదు. కొన్ని చెరువులోపలే నిర్మించారు. ఇది కరెక్టు పద్దతి కాదు. ఎస్టీపీ కానీ, ఈటీపీ కాని నిర్మించే ముందు ప్రజల్ని అందులో భాగస్వాముల్ని చేయాలి. నిపుణులతో చర్చించాలి. కన్సల్టెన్సీలు ఇచ్చిన ప్రతిపాదనలతో ముందుకు వెళ్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు.
డాక్టర్ బాబూరావు, రిటైర్డ్ సైంటిస్ట్, ఐఐసీటీ
పాలు, కల్లు, చేపలు, కూరగాయలు ఏవీ పనికి రావు
మూసీ తీరప్రాంతంలో బతికే లక్షలాది మంది జనం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మూసీ నీళ్లు ఎందుకు పనికి రాకుండా పోయాయి. పరిశ్రమల వ్యర్థాల్ని దొంగ చాటుగా ట్యాంకర్లలో తెచ్చి మూసీలో పోస్తున్నారు. ఆ నీళ్లు వ్యవసాయానికి పనికి రావు. పండిన కూరగాయలు, ఆకు కూరల్ని ఎవరూ కొనటం లేదు. పాలు తాగడం లేదు. మూసీ తీరంలో ఉన్న చెట్ల కల్లు పనికి రాకుండా పోయింది. ఎన్నో సార్లు చేపలు చనిపోతున్నాయి. ఒకవేళ చేపలు పడితే ఆ కూర మధ్యాహ్ననికే వాసన వచ్చి పాడైపోతోంది. అన్ని రకాల వృత్తులు ధ్వంసం అయ్యాయి. ఇపుడు మూసీని శుద్ధి చేస్తమని అంటున్నరు. గతంలో ఇట్లా ఎన్నోసార్లు చెప్పారు. ఏం ప్రయోజనం కలుగలేదు. ఇపుడు ఎస్టీపీలు ఉన్నా నీళ్లు మాత్రం అట్లనే ఉండిపోయాయి.
- పిట్టల అశోక్, కన్వీనర్, మత్సకారుల ఐక్యవేదిక
ఈటీపీలే కావాలి
దశాబ్దాల నిర్లక్ష్యానికి మూసీ నిలువెత్తు నిదర్శనం. ఒకప్పుడు తాగు నీటి వనరుగా ఉన్న ఈ నదికి ఇలాంటి గతి పట్టడం బాధ అనిపిస్తోంది. మూసీ తీరంలో లక్షలాది మంది బతుకుతున్నారు. దానిపై ఆధారపడి జీవించే వాళ్లు కొందరైతే, ఆ పరివాహక ప్రాంతాల్లో వివిధ రకాలైన పనులు చేసుకునే వాళ్లు ఇంకొందరు. వీళ్లంతా మూసీ కాలుష్యానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభుత్వం మూసీని పక్షాళన చేస్తం, డెవలప్ చేస్తం అంటున్నది. అయితే మూసీ శుద్ధి కోసం ఎస్టీపీలను ఏర్పాటు చేస్తే ఎట్లాంటి ప్రయోజనం లేదు. ఈటీపీలే ఉండాలి. అపుడే ఆ నీళ్లు బాగుపడతాయి.
సుదర్శన్ రెడ్డి, కంటెస్టెడ్ ఎమ్మెల్యే, మేడ్చల్ - పి.శశికాంత్ రెడ్డి (తెలుగుప్రభ స్టేట్ బ్యూరోచీఫ్)