Wriddhiman Saha| స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను కోల్పోయిన భారత జట్టుకు మరో షాక్ తగిలింది. భారత సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా(Wriddhiman Saha) అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్(Ranji Trophy) తనకు చివరి సీజన్ అని తెలిపాడు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు.
‘క్రికెట్‌లో ప్రతిష్టాత్మకమైన ప్రయాణం తర్వాత, ఇదే నా చివరి సీజన్. నేను రిటైర్ అయ్యే ముందు రంజీ ట్రోఫీలో మాత్రమే ఆడుతూ.. చివరిసారిగా బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ సీజన్‌ని గుర్తుంచుకునేలా చేద్దాం..!’ అంటూ రాసుకొచ్చాడు. కాగా 40 ఏళ్ల ఆటగాడు టీమిండియా తరపున 40 టెస్టులు, 9 వన్డేల్లో ఆడాడు. ఇక ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్తా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రాంఛైజీల తరపున ప్రాతినిధ్యకం వహించాడు.
టెస్టుల్లో మిస్టర్ కూల్, దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోనీ(MS Dhoni) రిటైర్మెంట్ తర్వాత కొంతకాలం భారత జట్టుకు ఆడాడు. అయితే మధ్యలో ఫామ్ కోల్పోవడం, యువ క్రికెటర్లు జట్టులోకి రావడంతో సాహా స్థానానికి ఎసరు పడింది. రిషబ్ పంత్ (Rishabh Panth), కేఎస్ భరత్(KS Bharath) వంటి ఆటగాళ్లు బీసీసీఐ దృష్టి పెట్టడంతో సాహా జట్టు నుంచి దూరమయ్యాడు. 2021లో న్యూజిలాండ్ జట్టుపై చివరి టెస్టు ఆడాడు. తన టెస్టు కెరీర్‌లో 3 సెంచరీలు నమోదుచేసి 1353 పరుగులు చేశాడు. ధోనీ, పంత్ తర్వాత భారత్ తరపును టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన వికెట్ కీపర్‌గా నిలిచాడు.