అసలు మోడీ దేశం కోసం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. సామాన్య ప్రజలు చిన్న లోన్ తీసుకుంటే బ్యాంకులు ముక్కు పిండి వసూలు చేస్తాయి కానీ మోడీ తన కార్పొరేట్ మిత్రులు తీసుకున్న 12 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని అన్నారు. ఎవడబ్బ సొమ్మని తమ కార్పొరేట్ మిత్రులకు మేలు చేసి దేశ ప్రజల మీద భారం వేశారని ఆయన నిలదీశారు. అప్పనంగా వచ్చిన 12 లక్షల కోట్లను బిజెపి అధికారంలో లేని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టేందుకు ఖర్చు చేస్తున్నారన్నారు. అట్లా ఇప్పటికే 12 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలను కూలదోశారని మండిపడ్డారు. వేల కోట్ల ఎల్ఐసి ప్రీమియం డబ్బులను కూడా పక్కదోవ పట్టించిన ఘనత మోదిది అని అన్నారు. తన మిత్రుడు అదానీ కేవలం 8 ఏళ్లలో 45 వేల కోట్ల నుండి 11లక్షల కోట్లకు పడగలెత్తిండు ఆ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చిందని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కేసిఆర్ గారి జనరంజక పాలనకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గంలోని బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలకు చెందిన సుమారు 500 మంది రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో శనివారం బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.