America Elections| ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇవాళ(మంగళవారం) సాయంత్రం 4.30 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. రేపు(బుధవారం) మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది. అనంతరం వెంటనే కౌంటింగ్ స్టార్ట్ కానుంది. అమెరికాలో మొత్తం 25 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటికే దాదాపు ఆరున్నర కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెయిల్స్ ద్వారా, పోలింగ్ కేంద్రాలకు వచ్చి మరీ ఓట్లు వేస్తున్నారు.
ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నవంబరు నెలలో వచ్చే తొలి మంగళవారం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరుపున డొనాల్డ్ ట్రంప్(Donald Trump).. డెమోక్రాట్ల తరుపున కమలా హారిస్(Kamala Harris) బరిలో ఉన్నారు. ఇద్దరు గెలుపే లక్ష్యంగా హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఇద్దరి మధ్య పోటీ నువ్వా? నేనా? అన్నట్లు ఉందని సర్వే సంస్థలు వెల్లడించాయి. ఇవాళ జరిగే పోలింగ్‌తో ఇద్దరిలో ఎవరు అమెరికా అధ్యక్షులవుతారన్నది అమెరికన్ ఓటర్లు తేల్చనున్నారు. పోటీ రసవత్తరంగా మారడంతో యావత్ అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా ఎదురు చూస్తుంది.
ప్రధానంగా స్వింగ్ స్టేట్స్(Swing states) అయిన కరోలినా, పెన్సిల్వేనియా, మిషిగన్, నార్త్ కరోలినా ప్రాంతాల్లో ఇద్దరు అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంచేశారు. ఈ రాష్ట్రాల ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నదే ఆసక్తికరంగా మారింది. అందుకే చివరి క్షణం వరకు స్వింగ్ స్టేట్స్‌లో ట్రంప్, కమలా పోటా పోటీ ప్రచారం నిర్వహించారు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో అన్న హామీలు ఇచ్చారు.
అగ్రరాజ్యం కావడంతో అమెరికన్ల ప్రయోజనాలను కాపాడటంతో పాటు అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై ఓటర్లు ఓటు వేసే అవకాశం ఉంటుంది. సర్వేలన్నీ ఇద్దరి మధ్య పోటాపోటీగా ఫలితాలు వెలువడ్డాయి. ఇద్దరి మధ్య ఓట్ల శాతం చాలా తక్కువగా ఉండటంతో గెలుపు ఎవరదిన్నది మాత్రం చెప్పడం కష్టంగా మారింది. మరోవైపు బెట్టింగ్ రాయుళ్లు కూడా కోట్లలో పందెం కాస్తున్నారు. దీంతో వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. మరి ఈ ఎన్నికల్లో అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ఎవరు ఎన్నుకోబడతారనే ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది.