Vasamsetti Subash| సీఎం చంద్రబాబు(CM Chandrababu) తనపై ఆగ్రహం వ్యక్తంచేసిన ఘటనపై మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉండే చంద్రబాబు.. తమకు ఎన్నో సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారని స్పష్టంచేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ అంశాల్లో వెనకబడారో తెలుసుకుని.. వారికి దిశానిర్దేశం చేస్తా ఉంటారని తెలిపారు. చంద్రబాబు తమకు తండ్రి లాంటి వారన్నారు. పిల్లలు ఏమైనా చిన్న పొరపాట్లు చేస్తే మందలించే బాధ్యత తండ్రికి ఎలా ఉందో.. తాము పనిలో ఏమైనా పొరపాట్లు చేసినా మందలించే హక్కు చంద్రబాబుకు ఉందని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదుకు తాము కృషి చేస్తున్నా.. ఓటర్లు పూర్తిస్థాయిలో ఓటు నమోదు చేసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. దీనిపై తనతో సీఎం చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన మాటలను ఎవరో గిట్టనివారు అసూయతో వాయిస్ రికార్డు చేసి బయటకు విడుదల చేశారని మండిపడ్డారు.
కాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదు ప్రక్రియను సీరియస్‌గా తీసుకోవడం లేదని మంత్రి సుభాష్‌పై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మీకు మంత్రివర్గంలో చోటు కల్పించామని.. అయినా పట్టుదల లేకపోతే ఎలాగయ్యా అని సీరియస్ అయ్యారు. సరిగా పనిచేయకపోతే తాను సీరియస్‌గా ఆలోచిస్తా.. పార్టీకి ఉపయోగపడకపోతే మీకు రాజకీయాలు ఎందుకయ్యా అని మండిపడ్డారు. కాగా ఇప్పటికే సుభాష్‌కు వ్యతిరేకంగా ఆయన ప్రత్యర్థులు చంద్రబాబుకు వరుసగా ఫిర్యాదులు చేశారు.