కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) పై మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణానికి సంబంధించిన కేసులో ఇప్పటివరకు జరిపిన విచారణ వివరాలను సమర్పించాలని కర్ణాటక హైకోర్టు మంగళవారం రాష్ట్ర లోకాయుక్తను ఆదేశించింది. సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై స్పందించాలని కోరుతూ జస్టిస్ ఎం నాగప్రసన్న సీఎం సిద్ధరామయ్యకు, ఆయన సహ నిందితులకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేశారు.
ముడా కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ, ముడా కుంభకోణంలో ముగ్గురు ఫిర్యాదుదారులలో ఒకరైన స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన పిటిషన్ ను నేడు హైకోర్టు విచారించింది. లోకాయుక్త రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సంబంధించిన కేసులో న్యాయమైన విచారణ జరగకపోవచ్చని కృష్ణ అనుమానాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా.. ప్రజా విశ్వాసాన్ని చూరగొనే విధంగా లోకాయుక్త దర్యాప్తు చేయకపోవచ్చని పిటిషనర్ భయపడ్డారని కృష్ణ తరఫు సీనియర్ న్యాయవాది కెజి రాఘవన్ కోర్టుకు తెలిపారు. వాదనల అనంతరం నవంబర్ 26న తదుపరి విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది.
Also Read : ‘ప్రైవేట్ ఆస్తులన్నిటిని ప్రభుత్వం తీసుకోరాదు’
ముడా తన భార్య పార్వతికి మంజూరు చేసిన భూమికి సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) పై అవినీతి కేసులు పెట్టేందుకు గవర్నర్ మంజూరు చేసిన అనుమతిని సవాల్ చేస్తూ సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌లో జస్టిస్ నాగప్రసన్న తోసిపుచ్చారు. ఆ తర్వాత, ముడా స్థలాల కేటాయింపులకు సంబంధించి అవినీతి, మోసం, ఫోర్జరీ ఆరోపణలపై కర్ణాటక లోకాయుక్త సిద్ధరామయ్యతో పాటు మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.