మహారాష్ట్ర ఎన్నికలు (Maharashtra Elections) రసవత్తరంగా మారాయి. ప్రముఖ రాజకీయ నేత, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మంగళవారం బారామతిలో ఒక సభలో ప్రసంగించిన శరద్ పవార్… తాను రాజకీయాల నుంచి రిటైరయ్యే ఆలోచనలో ఉన్నట్టు హింట్ ఇచ్చారు. రాజ్యసభలో తన ప్రస్తుత పదవీకాలం ఇంకా ఏడాదిన్నర మిగిలి ఉందని, ఇది ముగిసిన తర్వాత తాను మరో పదవీకాలం కొనసాగాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటానని శరద్ పవార్ వెల్లడించారు.
కాగా, నవంబరు 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra Elections) తన బాబాయి అజిత్ పవార్‌తో తలపడనున్న ఎన్‌సిపి (ఎస్‌పి) అభ్యర్థి యుగేంద్ర పవార్ కోసం శరద్ పవార్ ప్రచారం చేస్తున్నారు. రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఎన్సీపీ పోటాపోటీగా తలపడుతున్న వేళ సీనియర్ పవార్ రిటైర్మెంట్ అంశం చర్చనీంశంగా మారింది. శరద్ పవార్ దశాబ్దాలుగా భారత రాజకీయాలలో ప్రముఖుడిగా మహారాష్ట్రలోనే కాకుండా జాతీయ వేదికపై కూడా కీలక పాత్ర పోషించారు. పార్లమెంటరీ రాజకీయాల నుండి శరద్ పవార్ నిష్క్రమణ మహారాష్ట్ర రాజకీయ రూపురేఖల్ని గణనీయంగా ప్రభావితం చేసే అవకాశం ఉండొచ్చు.