YS Sharmila| రాష్ట్ర ప్రజలకు వైసీపీ చేసింది పాపం అయితే.. కూటమి సర్కార్ పెడుతుంది శాపం అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వంపై ఎక్స్(ట్విట్టర్) వేదికగా విమర్శలు చేశారు.
“విద్యుత్ ఛార్జీలపై గత ప్రభుత్వం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాల్సింది పోయి.. ఆ పాపపు పరిహారాన్ని ప్రజల నెత్తినే మోపుతోంది ఇప్పటి కూటమి సర్కార్. రూ.18వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలు వసూళ్ళ విషయంలో మా తప్పేం లేదని, మాకసలు సంబంధమే లేదని, భారం మాది కాదని, ప్రజల మీదే ఆ మొత్తాన్ని మోపుతున్నారు. సర్దుబాటు కాదు ఇది.. ప్రజలకు “సర్దుపోటు”. కూటమి సర్కారు ప్రజలకు ఇచ్చిన భారీ కరెంటు షాక్.
విద్యుత్ ఛార్జీల విషయంలో..” వైసీపీ చేసింది పాపం అయితే – రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కార్ పెడుతున్నది శాపం”. గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ప్రజలకు ఏం సంబంధం ? ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తే పడే అదనపు భారం ప్రజల నెత్తిన మోపుతారా ? 5 ఏళ్లలో వైసీపీ భారం రూ.35వేల కోట్లు.. 5 నెలల్లో కూటమి భారం రూ.18 వేల కోట్లా? వైసీపీకి మీకు ఏంటి తేడా ? వైసీపీ 9సార్లు ఛార్జీలు పెంచిందని, కూటమి అధికారంలో కొస్తే ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచమని, అవసరం అయితే 30 శాతం తగ్గించేలా చూస్తాం అని ఎన్నికల్లో హామీ ఇచ్చారు.
ఇచ్చిన హామీలపై కట్టుబడి ఉంటే, తప్పు ఎవరు చేసినా ఆ భారాన్ని ప్రజలపై మోపొద్దనే చిత్తశుద్ది మీకుంటే.. వెంటనే రూ.18 వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయండి. పడుతున్న భారంపై నిధులు ఇవ్వాలని మోడీని గల్లా పట్టి అడగండి. ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేస్తే ఊరుకోమని, కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తోంది. ప్రజల ముక్కు పిండి ట్రూఅప్ ఛార్జీల రూపంలో, అధిక కరెంటు బిల్లులు వసూళ్లు చేస్తున్నందుకు నిరసనగా రేపటి నుంచి మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తున్నాం” అని షర్మిల వెల్లడించారు.