America Elections| అమెరికా అధ్యక్ష ఎన్నికల(US Elections) కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్(Kamala Harris) మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. అయితే ట్రంప్ మాత్రం కాస్త ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. అయితే తొలుత వెనకబడిన హారీస్ ప్రస్తుతం గట్టిగానే పుంజుకున్నారు. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో ట్రంప్ 230 ఎలక్టోరల్ ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కమలా 205 ఎలక్టోరల్ ఓట్ల కైవసం చేసుకుని గట్టి పోటీ ఇస్తున్నారు.
డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం కాన్సస్, అయోవా, మోంటానా, యుటా, నార్త్ డకోటా, వయోమింగ్, సౌత్ డకోటా, నెబ్రాస్కా, ఓక్లహోమా, టెక్సాస్, ఆర్కాన్సాస్, లూసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, మిస్సోరి, మిసిసిపి, ఒహాయో, వెస్ట్ వర్జీనియా, అలబామా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా, ఐడహో, నార్త్ కరోలినా వంటి 23 రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు.
ఇక కమలా హారిస్ కాలిఫోర్నియా, ఓరెగన్, వాషింగ్టన్, న్యూ మెక్సికో, వర్జీనియా, ఇల్లినోయీ, న్యూజెర్సీ, మేరీల్యాండ్, వెర్మాంట్, న్యూయార్క్, కనెక్టికట్, డెలవేర్, మసాచుసెట్స్, రోడ్ ఐల్యాండ్, కొలరాడో, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా వంటి రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు.
అయితే ఈ ఫలితాల్లో అత్యంత కీలకమైన స్వింగ్ స్టేట్స్(Swing States)లోనూ ట్రంప్ దూసుకుపోతుండటం విశేషం. జార్జియాలో 2020 ఎన్నికల్లో డెమోక్రట్లకు 16 ఎలక్టోరల్ ఓట్లు రాగా.. ఇప్పుడు ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక మరో ప్రధాన రాష్ట్రం పెన్సిల్వేనియాలో తొలుత హారిస్ ముందుంజలో ఉండగా.. ప్రస్తుతం ట్రంప్ లీడ్‌లోకి వచ్చారు. కాగా నరాలు తెగే ఉత్కంఠగా సాగుతున్న ఎన్నికల ఫలితాల్లో విజయం ఎవరు సాధిస్తారో అనే దానిపై అంతర్జాతీయ సమాజం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.