US Election Results |అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(Donald Trump) గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్‌కి 270 సీట్లు అవసరం కాగా.. ట్రంప్ ఇప్పటికే 277 సీట్లను గెలుచుకున్నారు. అత్యంత ప్రాధాన్యమైన స్వింగ్ స్టేట్స్(Swing States)లో సైతం ట్రంప్ ఆధిపత్యం చెలాయించారు. దీంతో ట్రంప్ విజయం బావుటా ఎగురవేశారు. విజయం అనంతరం ట్రంప్ జాతినుద్దేశించి ప్రసంగించారు.
అమెరికా చరిత్రలో ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదని ట్రంప్ తెలిపారు. ఈ ఎన్నికల యుద్ధంలో రిపబ్లికన్లు గొప్పగా పోరాడారని ప్రశంసించారు. అమెరికన్లకు సువర్ణ యుగం రాబోతుందన్నారు. అక్రమ వలసదారులను కట్టడి చేస్తామని.. ఇకపై ఎవరైనా చట్టబద్దంగానే దేశంలోకి రావాలని స్పష్టంచేశారు. అమెరికా ప్రజలు గర్వపడేలా అభివృద్ధి చేస్తామన్నారు. అమెరికా ప్రజలు తనకు గొప్ప విజయాన్ని అందించారని సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని చెప్పుకొచ్చారు. స్విగ్ రాష్ట్రాల్లో తాను ఊహించిన దాని కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయని పేర్కొన్నారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌తో సహా తన విజయానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అమెరికా రాజకీయాల్లో మస్క్ కొత్త స్టార్ అని వెల్లడించారు.
మరోవైపు ట్రంప్ విజయం కోసం తీవ్రంగా కృషి చేసిన ఎలాన్ మస్క్ ప్రస్తుతం చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. వైట్ హౌస్‌లోకి కిచెన్ సింక్‌తో అడుగుపెట్టినట్లు ఓ ఎడిటెడ్ ఫొటోను మస్క్ పోస్టు చేశారు. దీనికి ‘LET THAT SINK IN’ అని ట్యాగ్ లైన్ ఇచ్చారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక ఆయన ఇలాగే సింక్‌తో ఆఫీసులోకి ఎంట్రీ అయ్యారు. అనంతరం తన విజన్‌కు అనుగుణంగా మార్పులు చేపట్టారు. అలాగే వైట్‌హౌస్‌లోనూ ట్రంప్ నేతృత్వంలో త్వరలోనే భారీ మార్పులు ఉంటాయని మస్క్ ఇలా సింబాలిక్‌గా చెప్పాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.