YS Sharmila| విద్యుత్ ఛార్జీల సర్దుబాటును వ్యతిరేకిస్తూ విజయవాడ ధర్నాచౌక్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించింది. ఈ ధర్నా కార్యక్రమంలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, మాజీ కేంద్రమంత్రి జేడీ శీలం, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. కరెంటు బిల్లు-జేబుకు చిల్లు, వైసీపీ పాపం-కూటమి శాపం అంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యుత్ ఛార్జీల సర్దుబాటుపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ చంద్రబాబు(CM Chandrababu) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
షర్మిల ఏమన్నారంటే..?
“కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి కేవలం 5 నెలలు మాత్రమే అయింది. 5 నెలల్లోనే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. అత్యంత దారుణంగా కరెంటు ఛార్జీల భారాన్ని మోపుతున్నారు. ఇప్పటికే రూ.6 వేల కోట్ల భారం మోపారు. ఇది చాలదు అన్నట్లు ఇంకో రూ.11వేల కోట్లు సిద్ధం చేశారు. మొత్తం రూ.17 వేలకోట్లు సర్దుబాటు కింద మోపుతున్నారు. ప్రజలు ఏం పాపం చేశారు చంద్రబాబు గారు ? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలపై ఎన్నో హామీలు ఇచ్చారు.
వైసీపీ 9 సార్లు ఛార్జీలు పెంచిందని గగ్గోలు పెట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఇది జరిగేది కాదంటూ ప్రగల్భాలు పలికారు. తీరా అధికారంలో వచ్చాకా మాట మార్చారు. మీకు ఓట్లు వేయడం ప్రజలు చేసిన పాపమా ? ప్రతిపక్షంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోరా ? జగన్ మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో రూ.35 వేల కోట్లు భారం మోపితే… మీ 5 నెలల పాలనలో రూ.17 వేల కోట్లు భారమా ? ఇది న్యాయమా చంద్రబాబు ? విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయి అన్నారు. అవకతవకలు జరిగితే చర్యలు తీసుకోవాలి.
గత ప్రభుత్వం చేసిన పాపానికి ప్రజల మీద భారాన్ని మోపుతారా ? బాబు గారు కేంద్రం నుంచి నిధులు తీసుకురండి. సెంట్రల్ ERC మీ చేతుల్లోనే ఉంది. కేంద్రం నుంచి నిధులు తెచ్చి విద్యుత్ బిల్లులు మీరే చెల్లించండి. బీజేపీకి గత 10 ఏళ్లుగా ఊడిగం చేస్తున్నారు కదా. బీజేపీకి మద్దతు ఇచ్చిన మీరు నిధులు తేవాలి కదా. ప్రజల నెత్తిన విద్యుత్ భారం వేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. వెంటనే సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలి.
ఇప్పటికే సూపర్ సిక్స్ అమలులో ఫెయిల్ అయ్యారు. సంక్షేమ పథకాలు అని చెప్పి… ఒక చేత్తో ఇస్తున్నారు. మరో చేత్తో వసూలు చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నారు.. ఇచ్చేది రూ.2,500.. వసూలు చేసేది రూ.6వేల కోట్లు. ఇచ్చేది పావలా… వసూలు చేసేది రూపాయి. తప్పు చేశారు కాబట్టే ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పారు. రూ.35 వేల కోట్ల భారం వేశారు కాబట్టే వైసీపీని ఘోరంగా ఓడించారు. వైసీపీ చేసింది పాపం అయితే… కూటమి పెడుతున్నది శాపం. వైసీపీకి కూటమికి తేడానే లేదు” అంటూ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.