Wednesday, November 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Vizianagaram MLC| వైసీపీకి షాక్... విజయనగరం ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ట్విస్ట్

Vizianagaram MLC| వైసీపీకి షాక్… విజయనగరం ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ట్విస్ట్

విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ట్విస్ట్ నెలకొంది. విజయనగరం ఎమ్మెల్సీ (Vizianagaram MLC) ఇందుకూరి రఘురాజు పై అనర్హత వేటును ఏపీ హైకోర్టు రద్దు చేసింది. ఆయనపై మండలి చైర్మన్ వేసిన అనర్హత వేటు చెల్లదని స్పష్టం చేసింది. తనపై అనర్హత వేటు పడడంతో గతంలో రఘురాజు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై పలుమార్లు విచారణ జరిపిన న్యాయస్థానం నేడు కీలక తీర్పు వెల్లడించింది. ఆయన 2027 నవంబర్ 31 వరకు విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. దీంతో విజయనగరం లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఎన్నిక నిలిచిపోనుంది.

- Advertisement -

వైసీపీ నుంచి 2021 లో విజయనగరం ఎమ్మెల్సీ (Vizianagaram MLC) గా ఎన్నికయ్యారు. ఎన్నికల సమయంలో ఆయన భార్య, కుటుంబసభ్యులు పార్టీని వీడి టీడీపీలో చేరారు. అయితే రఘురాజు వైసీపీలోనే ఉన్నప్పటికీ టీడీపీకి మద్దతుగా పని చేస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ నేతలు మండలి చైర్మన్ కొయ్యే మోషెన్ రాజుకి ఫిర్యాదు చేశారు. రఘురాజు నుంచి వివరణ కూడా తీసుకోకుండా మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు. దీనిని సవాల్ చేస్తూ రఘురాజు హైకోర్టును ఆశ్రయించారు. షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా, తన వివరణ తీసుకోకుండా శాసనమండలి చైర్మన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. తాను ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించలేదని పేర్కొన్నారు.

రఘురాజు పిటిషన్ పై బుధవారం విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ఆయనకి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఒక పార్టీ నుంచి శాసనసభకి ఎన్నికైన సభ్యుడు మరో పార్టీలో చేరితేనే ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుందని తేల్చి చెప్పింది. ఆయన కుటుంబసభ్యులు పార్టీ ఫిరాయించితే ఫిరాయింపుల నిరోధక చట్టం ఉల్లంఘన ఆయనకి వర్తించదని స్పష్టం చేసింది. ఈ నిబంధన ప్రకారం ఆయనపై మండలి చైర్మన్ వేసిన అనర్హత వేటును న్యాయస్థానం కొట్టేసింది. దీంతో ఆయన ఎమ్మెల్సీ టర్మ్ పూర్తయ్యేవరకు ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు.

ఉపఎన్నిక లేనట్లే…

విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు పడడంతో ఈ స్థానానికి ఈసీ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎన్నికలను వైసీపీ పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని పార్టీ అధినేత జిల్లా నేతలకు ఆదేశాలిచ్చారు. ఈరోజే జిల్లా నేతలతో మీటింగ్ పెట్టి చిన్న అప్పలనాయుడుని అభ్యర్థిగా ఖరారు చేశారు. విజయనగరంలో ఉన్న 753 స్థానిక సంస్థల ప్రతినిధుల్లో 592 మంది తమ పార్టీ నాయకులే కావడంతో విజయం తధ్యమని ధీమాగా ఉన్నారు. కానీ వారి ఆశల్లో ఏపీ హైకోర్టు నీళ్లు జల్లింది. ఈ స్థానానికి ఉపఎన్నిక లేకుండా పోయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News