Jammu Kashmir Assembly: ఆర్టికల్ 370 బిల్లు పునరుద్దరణపై జమ్మూకశ్మీర్ అసెంబ్లీ(Jammu Kashmir Assembly)లో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకొన్నారు. అసెంబ్లీ కార్యక్రమాలు మొదలుకాగానే అధికార ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్ ఆర్టికల్ 370 పునరుద్ధరించాలనే బ్యానర్‌ను ప్రదర్శించాడు. అయితే దీనికి ప్రతిపక్ష బీజేపీ నేత సునీల్ శర్మ తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీంతో సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడి.. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో శాసనసభలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ దాడి ఘటనను బీజేపీ తీవ్రంగా ఖండించింది. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రైనా స్పందిస్తూ నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు జాతి వ్యతిరేక శక్తులకు ఆశ్రయం ఇస్తున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పాకిస్తాన్ ఉగ్రవాదులతో చేయి కలిపింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా జమ్మూకశ్మీర్‌కు ఆర్టికల్ 370 పునరుద్ధరణపై కేంద్రప్రభుత్వం చర్చలు జరపాలని కోరుతూ ఉపముఖ్యమంత్రి సురేందర్ చౌదరి అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జమ్మూకశ్మీర్ ప్రజల హక్కులు, భద్రత, సంస్కృతిని కాపాడుకునేందుకు తమకు ప్రత్యేక హోదా అవసరమని పేర్కొన్నారు. ఇది తమకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని వ్యాఖ్యానించారు. అయితే ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రతిపక్ష నేత సునీల్ శర్మతో పాటు బీజేపీ సభ్యులు వ్యతిరేకించారు. తీర్మాన కాపీలను ముక్కలుగా చింపి అసెంబ్లీలో విసిరేశారు. ఈ గందరగోళం మధ్యే స్పీకర్ తీర్మానంపై అసెంబ్లీలో ఓటింగ్ నిర్వహించగా.. మెజారిటీ సభ్యులు మద్దతివ్వడంతో తీర్మానాన్ని సభ ఆమోదించింది.