Friday, November 22, 2024
HomeతెలంగాణHydra: బెంగళూరులో హైడ్రా కమిషనర్.. ఎందుకంటే..?

Hydra: బెంగళూరులో హైడ్రా కమిషనర్.. ఎందుకంటే..?

Hydra| హైదరాబాద్‌ నగరంలో చెరువుల్లో కబ్జాలు లేకుండా చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న హైడ్రా ఆ దిశగా కార్యాచరణ ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్(Ranganath) బెంగళూరు పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల పాటు బెంగళూరులో పర్యటించి అక్కడి చెరువుల పునరుద్దరణపై అధ్యయనం చేయనున్నారు. బుధవారమే హైడ్రా అధికారులు బెంగళూరు వెళ్లి తమ పని మొదలుపెట్టారు. చెరువులు పునరుద్దరణతో పాటు విపత్తు నిర్వహణపై అధ్యయనం చేస్తున్నారు.

- Advertisement -

ముందుగా తమ పర్యటనలో భాగంగా హైడ్రా అధికారులు యలహంకలోని కర్ణాటక స్టేట్ నేచురల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్‌ను సందర్శించనున్నారు. సీనియర్ శాస్త్రవేత్తలతో విపత్తు నిర్వహణపై చర్చిస్తారు. అనంతరం సెన్సార్స్ సహాయంతో పర్యవేక్షిస్తున్న మురుగునీటి వ్యవస్థను పరిశీలిస్తారు. తదుపరి బెంగళూరు కోర్ సిటీలో ఉన్న చెరువులను సందర్శిస్తారు. ఇక రెండో రోజు పర్యటనలో లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్‌తో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని మార్గందోన్హల్లీ చెరువు, ఇన్ఫోసిస్ సంస్థ అభివృద్ధి చేసిన చెరువులను సందర్శించనున్నారు.

కాగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఐదు చెరువులను పునరుద్ధరించాలని ఆదేశించిన నేపథ్యంలో హైడ్రా ఆ దిశగా చర్యలను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు జారీ చేస్తోంది. ఇప్పటికే 60 మందికి నోటీసులు ఇచ్చింది. ఈ నెలాఖరులోపు ఆ నిర్మాణాలను కూల్చివేయనుంది. చెరువుల్లోకి వచ్చే వ్యర్థాలను ఆపడానికి పొల్యూషన్ బోర్డుతో కలిసి పనిచేయనుంది. అంతేకాకుండా చెరువుల పూర్వ స్థితిగతులు తెలుసుకోవడానికి నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకోనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News