Pawan Kalyan| గత వైసీపీ ప్రభుత్వం వాలంటీవర్ వ్యవస్థ (Volunteer System) తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వాలంటీర్ల(Volunteers)ను ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం విధితమే. అలాగే పింఛన్ పంపిణీ కూడా చేయకూడదని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కొంతమంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేసి వైసీపీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
అయితే ఆ ఎన్నికల్లో కూటమి పార్టీలు అధికారంలోకి రావడంతో వాలంటీర్లను పక్కన పెట్టారు. కానీ ఎన్నికల సమయంలో మాత్రం రాజీనామా చేయని వాలంటీర్లను ప్రభుత్వం పథకాల కోసం కొనసాగిస్తామని.. రూ.10వేలు జీతం కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు దాటినా వాలంటీర్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.
ఈ క్రమంలోనే వాలంటీర్లపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో సర్పంచ్ సంఘాలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని సర్పంచులు పవన్ను విజ్ఞప్తి చేశారు. దీనిపై పవన్ స్పందిస్తూ ‘వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనలతో ప్రభుత్వం ఉంది. కానీ గత ప్రభుత్వం వారిని మోసం చేసింది. వాళ్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయవచ్చు. కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేదు. ఇదో సాంకేతిక సమస్య. దీనిపై చర్చ జరగాలి” అని పేర్కొన్నారు. దీంతో వాలంటీర్లను కొనసాగించడం సాంకేతికంగా సాధ్యం కాదనే చర్చ మొదలైంది.