PawanKalyan- Anitha: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత ముఖ్యమంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, ఫేక్ పోస్టులు పెడుతున్న వారిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించార. కొద్దిరోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు…వాటిపై హోంశాఖ తీసుకుంటున్న చర్యలను పవన్‌కు అనిత వివరించినట్లు సమాచారం. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు.
ఆడబిడ్డల పట్ల విచ్చలవిడిగా ప్రవర్తించే వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రతిక్షణం పనిచేస్తున్నామన్నారు. తానూ కూడా ఫేక్ పోస్టుల బాధితురాలే అని చెప్పకొచ్చారు. ఈ నేపథ్యంలో తన కుమార్తె కన్నీరు చూసే ఇటీవల పోలీసు వ్యవస్థపై వ్యాఖ్యలు చేశానని పవన్ వెల్లడించినట్లు తెలుస్తోంది. ఎవరైనా సరే ఆడబిడ్డలపై అసభ్యకర పోస్టులు పెట్టాలంటే వణుకు పుట్టేలా చర్యలు తీసుకోవాలని అనితకు సూచించారు.
కాగా ఇటీవల ఓ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇంట్లో ఆడవారిపై విమర్శలు చేసే వారిని ఇలాగే వదిలేస్తే హోంమంత్రిగా తాను బాధ్యతలు తీసుకుంటాను అని హెచ్చరించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా కీలకమన్నారు, ఇది పోలీసులు మర్చిపోవద్దని సూచించారు. గత ప్రభుత్వంలో మాదిరి అలసత్వం వహించకుండా డీజీపీ బాధ్యతలు తీసుకోవాలని కోరారని వెల్లడించారు. పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్- అనిత భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.