Borugadda Anil| ఏపీలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ఎంత హెచ్చరించినా సరే కొంతమంది పోలీసుల వ్యవహారశైలి మారడం లేదు. నేరస్తులకు అండగా నిలుస్తున్నారు. రిమాండ్ ఖైదీలకు రాచమర్యాదలు చేస్తున్నారు. ఓ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల రాజమండ్రి కేంద్ర కారాగానికి తీసుకెళ్తూ గన్నవరంలోని ఓ రెస్టారెంట్‌కు బోరుగడ్డను పోలీసులు తీసుకెళ్లారు. అక్కడ బిర్యానీ పెట్టించి తీసుకెళ్లారు. ఈ దృశ్యాలు వెలుగులోకి రావడంతో ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
అయినా కానీ మరికొంతమంది పోలీసుల్లో మార్పు రాలేదని స్పష్టంగా తెలుస్తోంది. బోరుగడ్డకు గుంటూరు పోలీస్ స్టేషన్‌లోనే సాక్షాత్తూ కుర్చీలు వేసి దగ్గరుండి మరీ అన్నం వడ్డించడం, కూర్చోవడానికి స్టేషన్లో రైటర్ సీట్ కేటాయించడం, పడుకోవడానికి బల్ల, దుప్పట్లు, దిండ్లు ఇవ్వడం సమకూర్చారు. ఓ నేరస్తుడికి రాచమర్యాదలు చేస్తున్న విజువల్స్ బయటకు రావడంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేత గట్టు తిలక్ గతంలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కర్నూలు మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో ఆయనను పీటీ వారెంట్‌పై కర్నూలుకు తీసుకొచ్చి విచారిస్తున్నారు.