Thursday, November 14, 2024
HomeTS జిల్లా వార్తలుకరీంనగర్Karimnagar Sankarpatnam: బోనస్ తప్పించుకోవడానికె కొనుగోళ్లలో జాప్యం

Karimnagar Sankarpatnam: బోనస్ తప్పించుకోవడానికె కొనుగోళ్లలో జాప్యం

బండి ఫైర్..

కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ పైసలివ్వకుండా తప్పించుకోవడానికి వడ్ల కొనుగోలు చేయకుండా జాప్యం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. బ్రోకర్ల నుండి కమీషన్లు దండుకునేందుకు రాష్ర రైతుల ప్రయోజనాలను బలి పెడుతున్నారని ధ్వజమెత్తారు. వడ్ల పైసలన్నీ మిత్తీతో సహా కేంద్రమే చెల్లిస్తోందన్నారు. అయినప్పటికీ వడ్లు కొనివ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన మిత్తీతో సహా నొప్పి ఏందని ప్రశ్నించారు.

- Advertisement -

ఏడాది పాలనపై కాంగ్రెస్ పార్టీ ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించడంపైనా బండి సంజయ్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ‘‘ఏం సాధించారని ప్రజా విజయోత్సవాలు చేసుకుంటున్నారు? 6 గ్యారంటీలు అమలు చేశారని విజయోత్సవాలు చేసుకుంటున్నారా? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, మహిళలకు తులం బంగారం, స్కూటీ, నెలనెలా రూ.2500 లు ఇచ్చారని విజయోత్సవాలు చేసుకుంటారా? వృద్ధులకు రూ.4 వేల ఆసరా పెన్షన్ ఇచ్చారని చేసుకుంటారా? పేదలకు ఇండ్లు ఇచ్చారని చేసుకుంటారా? దేనికోసం విజయోత్సవాలు…నమ్మించి ఓట్లేయించుకుని మోసం చేసినందుకు ప్రజా వంచన ఉత్సవాలు చేసుకోండి.’’అంటూ దుయ్యబట్టారు..
ఆదివారం బండి సంజయ్ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు వద్ద బీజేపీ నాయకులతో కలిసి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. వడ్ల కొనుగోలులో రైతులు పడుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. ‘నేషనల్ హైవేపైన వడ్లు పోశారు? ఎన్నాళ్లయింది? వడ్లు కొంటున్నారా? బోనస్ ఇచ్చారా? కనీస మద్దతు ధర ఇస్తున్నారా? తాలు, తరుగు లేకుండా వడ్లు కొంటున్నారా?’’అని అడిగారు. నెలరోజులైనా వడ్లు కొనడం లేదని, అడ్డికి పావుశేరు బ్రోకర్లకు అమ్ముకోవాల్సి వస్తుందని వాపోయారు. ప్రతి ఏటా నష్టపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన యాక్షన్ ప్లాన్ కు, ఆచరణకు పొంతనే లేదన్నారు. కొనుగోలు కేంద్రాలు కూడా నేటికీ పూర్తిగా ప్రారంభించలేదని పేర్కొంటూ సర్కార్ గణాంకాలతోసహా వివరిస్తూ కాంగ్రెస్ ను తూర్పారపట్టారు.

40 రోజులైనా..
నవంబర్ 10 ప్రభుత్వ లెక్కల ప్రకారమే వడ్ల కొనుగోలు ప్రారంభమై 40 రోజులైంది. యాడ చూసినా కొనుగోలు కేంద్రాల్లో వడ్లు రాశులుగా పోసిర్రు. అక్కడ జాగాలేక, టార్పాలిన్ కవర్లు లేక రోడ్లపై రాశులు పోసిన దృశ్యాలే కనిపిస్తున్నా యి . మరి ఈ 50 రోజుల్లో ఎన్ని వడ్లు కొన్నరు? ఎంత మంది రైతులకు డబ్బులిచ్చిర్రు? నేను చెప్పనా? ఇదిగో లెక్క ఇవి నేను చెప్పేవి కాదని డిపార్ట్మెంట్ లెక్కలే.
అక్టోబర్ లో 8 లక్షలు, నవంబర్ లో 33 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా వడ్లు కొంటామని ప్రకటించారని . ఇయాల్టికి 40 రోజులైనయ్. ఈ లెక్కన ఇయాళ్టికి దాదాపు 20 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనాలే.. కానీ అందులో 20 వంతు కూడా కొనలేకపోయిర్రు. ఇదిగో లెక్క… 5వ తేదీ నాటికి 95 వేల 140 ల మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే కొన్నరు. 220 కోట్ల 72 లక్షలు చెల్లించాల్సి ఉండగా ఇయాళ్టి వరకు 6 కోట్ల 44 లక్షలు మాత్రమే చెల్లించిర్రు. రైతులు ఇంత గోస పడుతుంటే ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు కూడా ఓపెన్ చేయలేదంటే ఏమనాలి? గతేడాదితో పోలిస్తే కూడా ఈసారి చాలా తక్కువ వడ్లు కొన్నరు. గత ఏడాది ఇదే సమయానికి 2 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నరు. ఈసారి లక్ష మెట్రిక్ టన్నులు కూడా కొనలే. అందుకే నేను పదేపదే చెబుతున్న. రైతులు, తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లయిందని… పోనీ వడ్లు రాలేదా? అంటే… ఇప్పటికే 30 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా వడ్లు వచ్చినయ్. రైతులంతా నెలరోజులు కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు పోసి ఎదురు చూసిర్రు. రోడ్లపైన రాశులు పోసిర్రు.. అయినా ప్రభుత్వం వడ్లు కొనకుండా అరిగోస పెట్టడంతో విసిగిపోయిన రైతులు అడ్డికి పావుశేరుకు మిల్లర్లకు అమ్ముకుంటున్నరు.

బోనస్ చెల్లించాల్సిందే..

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు వడ్లన్నీ కొనాల్సిందే. బోనస్ చెల్లించాల్సిందే. తరుగు, తాలు లేకుండా కొనాల్సిందే. అట్లాగే ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల గత 40 రోజులుగా తెచ్చిన వడ్లను అడ్డికి పావుశేరుకు బ్రోకర్లకు అమ్ముకుని మోసపోయిన రైతులకు పరిహారం కూడా అందించాలి.
ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, మండల బిజెపి పార్టీ అధ్యక్షులు ఏనుగుల అనిల్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు కొమురయ్య, నాయకులు దొంగల రాములు , పల్లె శివారెడ్డి, చుక్కల శ్రీకాంత్, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News