Friday, November 22, 2024
HomeతెలంగాణDudyala | దుద్యాల ఘటనపై హరీష్ రావు ఫైర్

Dudyala | దుద్యాల ఘటనపై హరీష్ రావు ఫైర్

సీఎం సొంత ఇలాకాలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి ఘటన సంచలనంగా మారింది. ఫార్మా విలేజ్ ఏర్పాటుకై భూసేకరణ కోసం రైతులతో చర్చలు జరిపేందుకు దుద్యాల (Dudyala) మండలం లగిచర్ల గ్రామం వెళ్లిన అధికారులపై ప్రజలు దాడి చేశారు. ఈ ఘటనపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు… “రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా తయారైంది. ఆ రాయి ఈరోజు ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన వికారాబాద్ రైతన్నల నెత్తిన పడింది. అందుకే రైతులు రేవంత్ మీద ఉన్న కోపాన్ని జిల్లా కలెక్టర్, ప్రభుత్వ అధికారుల మీద చూపుతున్నారు. రేవంత్ చేస్తున్న అసమర్థ పాలనకు ఐఎఎస్ లు, ప్రభుత్వ అధికారులు ప్రజాగ్రహానికి గురవుతున్నారు” అని దుయ్యబట్టారు.

- Advertisement -

ఫార్మా సిటీ కోసం కెసీఆర్ హైదరాబాద్ కి దగ్గరగా, కాలుష్యం లేకుండా, జీరో వ్యర్థాలతో 15 వేల ఎకరాలు సేకరించి సిద్దం చేశారని హరీష్ రావు గుర్తు చేశారు. పర్యావరణం, అటవీ సహా అన్ని రకాల అనుమతులు వచ్చిన దాన్ని పక్కన బెట్టి పచ్చటి పొలాల్లో సీఎం ఫార్మా చిచ్చు పెడుతున్నాడని మండిపడ్డారు. జహీరాబాద్ న్యాల్కల్ మండలంలోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉందన్నారు.

ఫార్మాసిటీ కోసం సేకరించిన భూమిని తన రియల్ ఎస్టేట్ దందా కోసం వినియోగించే కుట్రతో ఈ సమస్య మొదలైందని హరీష్ రావు ఆరోపించారు. “నీ మీద, నీ పాలన మీద తిరగబడని వర్గం ఏదైనా ఉందా రేవంత్ రెడ్డి? ఇప్పటికైనా పిచ్చి పనులు మాని పరిపాలన మీద దృష్టి పెట్టాలని, పచ్చని పొలాల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం” అన్నారు హరీష్ రావు.

కాగా, వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లోని దుద్యాల (Dudyala) మండలంలో ఫార్మా విలేజ్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం మండలంలోని లగిచర్ల, పోలేపల్లి, హీకంపేట మూడు గ్రామాల్లో 3000 ఎకరాల భూసేకరణ కోసం అధికారులు కసరత్తు ప్రారంభించారు. దీనికోసం ముందుగా లగిచర్ల గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ చేసేందుకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, రెవెన్యూ అధికారులు, పోలీసులు గ్రామానికి వచ్చారు.

వారితో చర్చలు జరిపేందుకు అధికారులు ప్రయత్నించగా ప్రజల నుంచి ఆందోళన మొదలైంది. ప్రజలు అధికారులపై దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాళ్లతో వాహనాలు ధ్వంసం చేశారు. భూమి ఇవ్వము, వెనక్కి వెళ్లిపోవాలంటూ ఆందోళన చేశారు. ఈ క్రమంలో ఓ మహిళ జిల్లా కలెక్టర్ పై చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News