Thursday, November 14, 2024
HomeతెలంగాణVikarabad SP: అధికారులపై దాడి వెనక కుట్ర కోణం: ఎస్పీ నారాయణ రెడ్డి

Vikarabad SP: అధికారులపై దాడి వెనక కుట్ర కోణం: ఎస్పీ నారాయణ రెడ్డి

Vikarabad SP| వికారాబాద్ జిల్లాలో అధికారులపై జరిగిన దాడి వెనక కుట్ర కోణం దాగి ఉందని ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని మణికొండకు చెందిన బోగమోని సురేష్‌ అనే వ్యక్తి కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించారని తెలిపారు. అధికారులు, కలెక్టర్‌ను ఉద్దేశపూర్వకంగానే పక్కకు తీసుకెళ్లి గ్రామస్తులతో దాడి చేయించారని పేర్కొన్నారు. సురేష్‌ను బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తగా గుర్తించామన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా గ్రామానికి వెళ్లిన సురేష్.. గ్రామస్థులను రెచ్చగొట్టినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. ప్రస్తుతం ఆరు గ్రామాల్లో పరిస్థితి అదుపులో ఉందని, గ్రామస్తులు ఎవరూ వదంతులను నమ్మొద్దని సూచించారు. ప్రస్తుతం సురేష్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని ఎస్పీ తెలిపారు.

- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. లగచర్ల (Lagacharla) గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు అధికారులపై దాడి ఘటనలో 55 మందిని అరెస్ట్ చేశారు. రైతుల అరెస్టుపై మాజీ మంత్రి కేటీఆర్, హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరు అమానుషమని.. అరెస్ట్ చేసిన లగచర్ల వాసులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు అధికారులపై దాడి ఘటనకు నిరసనగా.. రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసనకు దిగారు. వికారాబాద్‌ జిల్లాలో అయితే ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. కాగా కొడంగల్‌ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీకి సంబంధించి భూసేకరణ కోసం అధికారులు గ్రామస్తుల వద్దకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఏకంగా జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌జైన్, అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్, సబ్‌ కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్, కొడంగల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ(కడా) ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిలపై ఆయా గ్రామాల రైతులు కర్రలు, రాళ్లతో దాడులకు యత్నించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News