YS Jagan| ఏపీ హైకోర్టు(AP Highcourt)లో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు స్వల్ప ఊరట లభించింది. మంత్రి నారాయణ వేసిన పరువునష్టం దావా క్వాష్ చేయాలంటూ జగన్ వేసిన పిటిషన్‌పై న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు జగన్ నేరుగా విచారణకు హాజరుకావాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. జగన్ తరపు న్యాయవాది హాజరైతే సరిపోతుందంటూ ఆదేశాలు జారీచేసింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది.
ఇదిలా ఉంటే జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు(Supreme Court)లోనూ కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు (Raghu rama krishna raju) దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను ప్రధాన న్యాయమూర్తి(CJI) నేతృత్వంలోని ధర్మాసనం మరో బెంచ్‌కు బదిలీ చేసింది. అక్రమాస్తుల కేసుల్లో జగన్ బెయిల్ రద్దు చేయడంతో పాటు విచారణను హైదరాబాద్ నుంచి వేరే రాష్ట్రానికి మార్చాలని రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సీజేఐ ధర్మాసనం ముందుకు వచ్చింది.
అయితే సీజేఐ ధర్మాసనంలో జస్టిస్ సంజయ్‌కుమార్ సభ్యుడిగా ఉన్నారు. ఈ పిటిషన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి అని జగన్ తరఫు న్యాయవాది రంజిత్‌కుమార్ వాదించారు. అలాగే తమకు కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలని సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విజ్ఞప్తిచేశారు. దీంతో జస్టిస్ సంజయ్ కుమార్ ‘నాట్ బిఫోర్ మీ’ అనడంతో RRR దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ అభయ్ ఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనానికి సీజేఐ బదిలీ చేశారు. ఈ ధర్మాసనం డిసెంబర్ 2న విచారణ జరపాలని ఆదేశించారు.