YS Jagan| వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మరోసారి మీడియా ముందుకు రానున్నారు. కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్‌పై జగన్ స్పందించనున్నారని తెలుస్తోంది. బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించలేదని ఇప్పటికే వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో జగన్ కూడా బడ్జెట్ కేటాయింపులతో పాటు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుపై మాట్లాడనున్నారని సమాచారం.
ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించింది. సభలో ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు జగన్ వెల్లడించారు. అందుకే అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు మీడియా ముందుకు వచ్చి ప్రజా సమస్యలను ప్రస్తావిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు రానున్నారు.
మరోవైపు శాసనసభ సమావేశాలను వైసీపీ బహిష్కరించడంపై కూటమి పార్టీలతో పాటు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే అసెంబ్లీకి రాకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. అసెంబ్లీకి రాకపోతే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ మీడియాతో ఏం మాట్లాడతారనే దానిపై ఆసక్తి నెలకొంది.