Ram Gopal Varma| వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, మద్దతుదారులపై వరుస కేసులు నమోదవుతున్నాయి. గత ఐదేళ్లు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన నాయకులను ఇష్టారీతిన వ్యక్తిగత విమర్శలు చేయడంపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ నేపథ్యంలోనే వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(RGV)పై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఎన్నికలకు ముందు ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్ సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా ఆర్జీవీ తన ఎక్స్‌లో పోస్టులు పెట్టారంటూ మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ వెళ్లారు.
మరోవైపు వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)పై విజయవాడ భవానీపురం పోలీసులకు జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. 2021 సెప్టెంబరు 28న హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో, 2024 ఏప్రిల్ 22న వైసీపీ కార్యాలయం వేదికగా జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై పోసాని తీవ్రంగా విమర్శలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.