కేటీఆర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన మెడికవర్ హాస్పిటల్స్ యాజమాన్యం వివరణ ఇచ్చింది. ఈమేరకు డాక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ ..మెడికవర్ హాస్పిటల్స్ కి రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. తమ ఆసుపత్రి మొదటి ప్రస్థానం హైటెక్ సిటీలో అప్పటి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతుల మీదగా మాక్స్ క్యూర్ ప్రారంభించినట్టు గుర్తుచేశారు. ఆతరువాత మెడికవర్ హాస్పిటల్స్ – స్వీడిష్ (యూరోపియాన్) కంపెనీ వారికి మెజారిటీ స్టేక్ ఇచ్చామన్నారు. 4 రాష్ట్రాలలో.. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ , మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో తాము సేవలను అందిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. తమ సంస్థకు చెందిన మొత్తం 24 హాస్పిటల్స్ ఆయా సందర్భాలలో ఎవరెవరు అధికారంలో ఉన్నారో వారిచేత తాము ప్రాంభించినట్టు ఆయన వివరించారు.
13 దేశాల్లో సేవలు..
ఒక ప్రపంచ ప్రసిద్ధ ఆరోగ్య సంస్థగా, మెడికవర్ 13 దేశాలలో సేవలందిస్తోంది. వీటిలో జర్మనీ, స్వీడన్, పోలాండ్, టర్కీ, బెలారస్, బల్గేరియా, జార్జియా, హంగేరీ, రొమేనియా, సెర్బియా, మోల్డోవా, ఉక్రెయిన్, భారతదేశం ఉన్నాయి. భారతదేశంలో, మెడికవర్ హాస్పిటల్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో ప్రధాన సేవలతో అందుబాటులో, ప్రతి సంవత్సరం కోట్లాది మంది రోగులకు వైద్య సేవలు అందిస్తోందని ఆయన తెలిపారు. తాము ఉన్నతమైన వైద్య సేవలు అందించే దిశగా కృషి చేస్తూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సాయం అందించడంలో ప్రత్యేకతను కలిగి ఉన్నట్టు తెలిపారు.
ప్రజల ఆరోగ్యం కోసం మేం సదా కృషి చేస్తూ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందుకు వెళ్తున్నట్టు, ఎలాంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేదని స్పష్టంచేశారు.
గొప్ప వ్యక్తుల చేతుల మీద అంటే గౌరవప్రదం..
కే. చంద్రశేఖర్ రావు, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, రామోహన్ నాయుడు, శరద్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ వంటి ప్రముఖులు, ఆధ్యాత్మిక నాయకుడు చినజీయర్ స్వామి వంటి గొప్ప వ్యక్తుల చేతులపై ఆసుపత్రులు ప్రారంభించటమంటే తమకు గౌరవప్రదమని ఆయన వివరించారు. వీరితో నిర్వహించిన ఈ కార్యక్రమాలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడానికి ఎల్లవేళలా ముందుంటామని అన్నారు.
సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అన్నం శరత్ రెడ్డి మాక్స్‌బీన్ ఫార్మాలో డైరెక్టర్ కాదని మాక్స్ క్యూర్ సంస్థ తెలిపింది. మెడికవర్ హాస్పిటల్స్ గురించి చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని సంస్థ వెల్లడించింది.
ఈ కార్యక్రమంలో డాక్టర్ అనిల్ కృష్ణ – మెడికవర్ హాస్పిటల్స్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, ఇండియా, డాక్టర్ అన్నం శరత్ రెడ్డి – డైరెక్టర్ & హరికృష్ణ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాల్గొన్నారు.