Patnam Narender Reddy| వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రంగారెడ్డి జిల్లా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో ఆయన ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. అయితే ఆయన జైలు నుంచే ఓ లేఖ విడుదల చేశారు.
“పోలీసులు తన పేరుతో ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ తప్పు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి కానీ కేసు గురించి కానీ ఎలాంటి స్టేట్మెంట్ పోలీసులు నా నుంచి తీసుకోలేదు. నేను వారికి చెప్పలేదు. కోర్టుకు వచ్చాక నా అడ్వొకేట్ అడిగితే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు. అప్పటివరకు రిమాండ్ రిపోర్టులో ఏముందో తెలియదు” అంటూ లేఖలో పేర్కొన్నారు. మరోవైపు వికారాబాద్ కోర్టులో నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
కాగా లగచర్ల ఘటన వెనక మాజీ మంత్రి కేటీఆర్ హస్తం ఉన్నట్లు నరేంద్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. కేటీఆర్ చెబితేనే దాడికి పాల్పడినట్లు నరేందర్ వాంగ్మూలం ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో కేటీఆర్ అరెస్ట్ ఖాయమనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాను కేటీఆర్ పేరు చెప్పలేదంటూ నరేందర్ రెడ్డి లేఖ విడుదల చేయడం చర్చనీయాంశమైంది.