Tim Southee| న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ టిమ్ సౌథీ అంతర్జాతీయ టెస్టు ఫార్మాట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. స్వదేశంలో ఇంగ్లండ్ జట్టుతో జరిగే మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్ తనకు చివరిదని పేర్కొన్నాడు. హామిల్టన్‌లోని తన హోంగ్రౌండ్ సెడాన్ పార్క్ వేదికగా జరగనున్న మూడో టెస్టు మ్యాచ్ తన కెరీర్‌లో చివరి టెస్ట్ మ్యాచ్ అని స్పష్టం చేశాడు. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశాడు. 18 సంవత్సరాల పాటు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపాడు. అయితే తనకు ఎంతో పేరు ప్రఖ్యాతలు అందించిన ఈ ఆట నుంచి వైదొలగేందుకు ఇదే సరైన సమయం అని చెప్పుకొచ్చాడు.
కాగా 35 ఏళ్ల టిమ్ సౌథీ కివీస్ జట్టు తరపున టెస్టుల్లో అద్భుతంగా రాణించాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గానూ అద్భుతంగా ఆడాడు. మొత్తం 104 టెస్టు మ్యాచ్‌లు ఆడి 29.88 సగటుతో 385 వికెట్లు తీశాడు. సర్ రిచర్డ్ హ్యాడ్లీ (431 వికెట్లు) తర్వాత కివీస్ తరపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా సౌథీ రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో 15 సార్లు 5 వికెట్ల ఫీట్ అందుకున్నాడు. 5 సార్లు 10 వికెట్లు తీశాడు.