AP Assembly| ఏపీ అసెంబ్లీలో మంత్రి వాసంశెట్టి సుభాష్(Vasamsetti Subhash)పై స్పీకర్ అయ్యన్నపాత్రుడు(Ayyanna patrudu) సీరియస్ అయ్యారు. ప్రశ్నోత్తరాల సమయానికి సభలో మంత్రి సుభాష్ లేకపోవడంతో ప్రశ్నను స్పీకర్ వాయిదా వేశారు. వాయిదా అనంతరం సుభాష్ అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని అయ్యన్న మంత్రికి చురకలు అంటించారు. ప్రజల కోసం గళం విప్పాల్సిన అసెంబ్లీలో అది కూడా బాధ్యతాయుత మంత్రి పదవిలో ఉండి ఆలస్యంగా వస్తే ఎలా అని నిలదీశారు. సకాలంలో వచ్చేందుకు మంత్రులు ప్రయత్నించాలని లేదంటే అసెంబ్లీ సమయం వృథా అవుతుందని అయ్యన్న సూచించారు. అసెంబ్లీకి ఆలస్యంగా వచ్చినందుకు మంత్రి సుభాష్ క్షమాపణ చెప్పారు. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని వెల్లడించారు.
కాగా ఇటీవల సీఎం చంద్రబాబు కూడా మంత్రి సుభాష్‌కు క్లాస్ తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఉన్న కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు, సుభాష్‌పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయింది. పట్టభద్రుల ఓట్ల నమోదు నమోదుతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను సీరియస్‌గా తీసుకోవడం లేదని ఇలా చేస్తే రాజకీయాలకు సరిపోవని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి సుభాష్ స్పందిస్తూ తండ్రి స్థానంలో ఉన్న చంద్రబాబు అంటే తనకు చాలా గౌరవమని, ఆయన తనకు తండ్రిలాంటి వారని తెలిపారు. తనను ఓ మాట అంటారని అవసరమైతే కొడతారంటూ వివరణ ఇచ్చారు.