Delhi Smog| దేశ రాజధాని ఢిల్లీ వాసులను వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గాలి నాణ్యత రోజురోజుకు క్షీణిస్తోంది. ఆకాశం నల్లగా మారి కాలుష్యపు కోరల్లో చిక్కుకుంది. గాలి నాణ్యత సూచీ(AQI) అధ్వాన్న స్థితికి చేరుకుంది. గురువారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 దాటిపోయింది. దీంతో ప్రజలు స్వచ్ఛమైన గాలి పీలుచుకోలేక.. శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్నారు. స్టేజ్ 3 హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. దీంతో ప్రభుత్వం కట్టడి చర్యలు చేపట్టింది. పొగ మంచు, వాయు కాలుష్యంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్‌ఏపీ)3 అమలు చేస్తున్నట్లు ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ ప్రకటించింది.
వాయు కాలుష్యం తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఎమర్జెన్సీ ప్రకటిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఐదో తరగతి వరకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆతిశీ తెలిపారు. ఐదు లోపు తరగతుల విద్యార్థులకు సెలవు ప్రకటించారు. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఈ ఆదేశాలు కొనసాగుతాయన్నారు. స్టేజ్ 3 ఆంక్షల ప్రకారం అత్యవసరం లేని నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం విధించారు. ఢిల్లీలో గాలి నాణ్యత క్రమంగా తగ్గడంతో ప్రజలు వీలైనంత వరకు బయటకు వెళ్లొద్దని వైద్యులు సూచించారు.
పర్వతాల నుంచి మంచు కురవడం వల్ల కూడా ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి పొగమంచు నగరాన్ని చుట్టముట్టింది. మరోవైపు సమీపంలోని హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోని పొలాల్లో పంటలు కాల్చడంతో వాయుకాలుష్యం కూడా విపరీతంగా పెరిగింది. దీంతో స్వచ్ఛమైన గాలి పీల్చేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కలుషితమైన గాలి పీలుస్తూ వ్యాధుల బారిన పడుతున్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వాటర్ స్ప్రింకర్లు ద్వారా నీటిని వీధుల్లో చల్లుతున్నారు. అలాగే కేవలం సీఎన్జీ(CNG) వాహనాలు మాత్రమే రోడ్డు మీదకు రావాలని ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం దేశంలోని వివిధ నగరాలత్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI)ఇలా ఉన్నాయి..
న్యూఢిల్లీ: 349 (Severe) ¹
ముంబై: 173 (Moderate) ²
బెంగళూరు: 34 (Good) ²
హైదరాబాద్: 152 (Moderate) ²
చెన్నై: 32 (Good) ²
కోల్‌కతా: 236 (Poor) ²
జైపూర్: 165 (Poor) ²
లక్నో: 317 (Severe) ²