Tattoos| ప్రస్తుతం ఆడ, మగ అనే తేడా లేకుండా ఒంటి మీద టాటూలు వేయించుకోవడం సాధారణమైపోయింది. కొంతమంది స్పెషలిస్టుల దగ్గర టాటూలు వేయించుకుంటుంటే.. మరికొందరు మాత్రం రోడ్డు పక్కన ఉండే వారి దగ్గర టాటూలు వేయించుకుంటారు. తాజాగా రోడ్డు పక్కన టాటూలు వేయించుకున్న 68 మంది మహిళలకు ఎయిడ్స్ వ్యాధి సోకిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్(Ghaziabad)లో రోడ్డు పక్కన ఉండే టాటూ ఆర్టిస్టుల నుంచి మహిళలు టాటూలు వేయించుకున్నారు. అయితే ఆ తర్వాత వారి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. దీంతో వారు ఆసుపత్రుల్లో చెక్ చేయించుకోగా HIV సోకినట్లు వైద్యులు తేల్చారు. టాటూ ఆర్టిస్ట్ HIV సోకిన సూదినే ఇతర మహిళలకు కూడా ఉపయోగించాడని మహిళలు ఆరోపిస్తున్నారు. ఈ 68 మంది మహిళలలో కనీసం 20 మంది తమకు వచ్చిన ఇన్ఫెక్షన్ టాటూల కారణంగా అయ్యిందని అనుమానిస్తున్నారు.
ఈ కేసులపై వైద్యులు స్పందించారు. వారికి సురక్షిత ప్రసవ సంరక్షణ అందించబడిందని తెలిపారు. అయితే టాటూల వల్ల HIV వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని కొంతమంది నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో టాటూ ట్రెండ్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టాటూలపై మోజుతో ఇలాంటి ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారని విమర్శించగా మరికొందరు మాత్రం సరైన జాగ్రత్తలు పాటిస్తే ఇలాంటి ప్రమాదాలు ఉండవని అభిప్రాయపడుతున్నారు. కాగా రోడ్డు మీద కానీ షాపుల్లో కానీ టాటూలు వేయించుకునే ముందు ఒకటికి పది సార్లు అన్ని చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.