Rahul Gandhi| కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) హెలికాఫ్టర్ టేకాఫ్ ఆలస్యం అయింది. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) నుంచి అనుమతి రాకపోవడంతో గంటకు పైగా ఆగిపోయింది. అనుమతులు రాకపోవడంతో హెలికాప్టర్‌లోనే రాహుల్ ఉండిపోయారు. దీంతో ఆయన షెడ్యూల్‌కు ఆటంకం ఏర్పడింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గొడ్డాలో ర్యాలీ నిర్వహించిన రాహుల్ గాంధీ.. వేరే ప్రాంతానికి ప్రచారానికి వెళ్లే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఏటీసీ అనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ నేతలు బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారానికి ఆటంకం కలిగించాలని ఉద్దేశపూర్వకంగానే అనుమతి ఇవ్వకుండా ఆలస్యం చేశారంటూ ఆరోపించారు. అయితే కాంగ్రెస్ విమర్శలపై బీజేపీ కూడా ఘాటుగా స్పందించింది. కాగా హెలికాప్టర్ టేకాఫ్ ఆలస్యానికి గల కారణాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు.